మీరే అవార్డులు ఇస్తారు.... మీరే విమర్శిస్తారు?

ప్రధాని నరేంద్రమోడీ శనివారం వరంగల్‌ పర్యటనలో రూ.6,109 కోట్లు విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.

హన్మకొండ బిజెపి విజయ్‌ సంకల్ప్ సభలో ప్రధాని నరేంద్రమోడీ ఈ తొమ్మిదేళ్ళలో తన ప్రభుత్వ హయంలో దేశం ఏవిదంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందో వివరించారు. ఆ అభివృద్ధిలో తెలంగాణ కూడా ఉందన్నారు. అయితే కేసీఆర్‌ కుటుంబం ప్రాజెక్టుల పేరుతో భారీగా అవినీతికి పాల్పడుతూ వేలకోట్లు ఆస్తులు పోగేసుకొందని ప్రధాని మోడీ ఆరోపించారు. 

సాధారణంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పనుల కోసం ఒప్పందాలు చేసుకొంటాయని కానీ కేసీఆర్‌, కేజ్రీవల్ ప్రభుత్వాలు ఏవిదంగా అవినీతి చేయాలనేదానికి ఒప్పందాలు చేసుకొని, వేలకోట్ల ప్రజాధనం దోచుకొన్నాయని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించారు.

తెలంగాణలో ఏ ప్రాజెక్టులో చూసిన కేసీఆర్‌ అవినీతి కనిపిస్తుందని అన్నారు. ఇక తెలంగాణలో టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ స్కామ్‌ గురించి అందరికీ తెలుసన్నారు. తెలంగాణ నుంచి బిఆర్ఎస్‌ పార్టీని, దేశంలో నుంచి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 

ప్రధాని నరేంద్రమోడీ విమర్శలు, ఆరోపణలకు మంత్రి హరీష్‌ రావు వెంటనే సమాధానమిచ్చారు. “ఢిల్లీ నుంచి తెలంగాణకు ఎవరు వచ్చినా సిఎం కేసీఆర్‌ని తిట్టడం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. కేంద్రం పైసా సాయం చేయకపోయినా తెలంగాణను అభివృద్ధి చేసుకొన్నామని, అందుకు కేంద్ర ప్రభుత్వమే అవార్డులు కూడా ఇస్తోందని అన్నారు. ఢిల్లీలో మెచ్చుకొని అవార్డులు ఇస్తూ తెలంగాణ గడ్డపై నిలబడి కేసీఆర్‌ని తిట్టడం ఏమిటని మంత్రి హరీష్‌ రావు ప్రశ్నించారు.

తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇచ్చామని ప్రధాని నరేంద్రమోడీ అబద్దాలు చెప్పారని, కానీ రాష్ట్రానికి రావాలసిన నిధులనే ఇంతవరకు చెల్లించలేదని మంత్రి హరీష్‌ రావు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఈడీ, సీబీఐల అండ ఉంటే బిఆర్ఎస్‌ పార్టీకి తెలంగాణ ప్రజలు అండగా ఉన్నారని మంత్రి హరీష్‌ రావు అన్నారు. బిఆర్ఎస్‌ పార్టీకి తెలంగాణ ప్రజల నమ్మకం ఉన్నంతవరకు కాంగ్రెస్‌, బిజెపిలు ఏమీ చేయలేవని మంత్రి హరీష్‌ రావు అన్నారు.