శనివారం వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ వస్తున్నారు. ఇవి అధికారిక కార్యక్రమాలు కనుక సిఎం కేసీఆర్‌ని కూడా వాటిలో పాల్గొనవలసిందిగా ప్రధాని కార్యాలయం ఆహ్వానించింది. అయితే అందరూ ఊహించినట్లే, ఈ కార్యక్రమాలకు కేసీఆర్ హాజరుకావడం లేదు.
మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని తెలంగాణ పర్యటనపై స్పందిస్తూ, “ తెలంగాణ పుట్టుకను తీవ్రంగా వ్యతిరేకించిన మోడీ ఏ మొహం పెట్టుకొని తెలంగాణకి వస్తున్నారు?తెలంగాణకు కేటాయించాల్సిన రూ.20 వేల కోట్లు విలువగల రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయి, తెలంగాణకు కేవలం రూ.521 కోట్లతో వ్యాగన్ ఓవర్‌తో హాలింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తారా?
విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఇస్తామని హామీ ఇచ్చినా ఎందుకు ఇవ్వలేదు? అసలు మోడీ పాలనలో దేశంలో ఏవైనా పెరిగాయంటే నిరుద్యోగం, అప్పులు మాత్రమే. తెలంగాణ పట్ల మనసంతా విషం నింపుకొని ప్రధాని నరేంద్రమోడీ వస్తే రావచ్చు కానీ మేమెవరం ఆయన కార్యక్రమాలకు హాజరుకాబోము,” అని తేల్చి చెప్పేశారు.
బిఆర్ఎస్ పార్టీ బిజెపికి బీ-టీమ్ అని కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పి కొట్టాలని సిఎం కేసీఆర్ మేరకు, మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై కూడా నిప్పులు చెరిగారు.
“రాహుల్ గాంధీ ఏ హోదాతో ఎన్నికల హామీలు ఇస్తున్నారో చెప్పాలి. ఆయన రోజుకో వేషం వేసుకొని చెప్పే మాయమాటలను దేశ ప్రజలు నమ్మేదుకు సిద్దంగా లేరు. నిజానికి కాంగ్రెస్, బిజెపిల మద్యనే రహస్య అవగాహన ఉంది. ప్రతీ ఎన్నికలలో అవి పరస్పరం సహకరించుకొంటూ మరో పార్టీని ఎదగనీయకుండా అడ్డుకొంటుంటాయి.
గాంధీ భవన్‌లోకి రేవంత్ రెడ్డి రూపంలో గాడ్సే దూరాడు. ఆయన ఏనాడూ ప్రధాని నరేంద్రమోడీని విమర్శించరు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విదాలా అభివృద్ధి చేసిన కేసీఆర్‌ని మాత్రం నిత్యం విమర్శిస్తూనే ఉంటారు. కాంగ్రెస్ నేతల భూదందాలు చేసుకొనీయకుండా ధరణీ పోర్టల్ అడ్డుగా ఉన్నందునే దానిని రద్దు చేస్తామని చెపుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపిలు ఎన్ని కుట్రలు చేస్తున్నా వచ్చే ఎన్నికలలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది. మళ్ళీ అధికారంలోకి వస్తుంది,” అని మంత్రి కేటీఆర్ అన్నారు.