
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఎన్నికలకు ముందు పదవిలో నుంచి తప్పించి కిషన్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పజెప్పడంతో తెలంగాణ బిజెపిలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే రఘునందన్ రావు, జితేందర్ రెడ్డి వంటి సీనియర్ నేతలు మీడియాలో పార్టీపై అసంతృప్తి వెళ్ళగక్కుతూ బండి సంజయ్‌పై తీవ్ర ఆరోపణలు చేయడం, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదవుల కోసం ఢిల్లీలో పైరవీలు చేయడం, రాష్ట్ర బిజెపి పగ్గాలు చేపట్టేందుకు కిషన్‌రెడ్డి ఆసక్తి చూపకపోవడం వంటి పరిణామాలన్నీ తెలంగాణ బిజెపిని రోడ్డున పడేశాయి.
ఈ పరిణామాలపై మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, వాదనలపై ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు.
శనివారం హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో జరుగబోయే ప్రధాని సభకు ఏర్పాట్లు పరిశీలించేందుకు ఈరోజు అక్కడికి వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ బిజెపి నేతల మద్య ఎటువంటి విభేధాలు, అసంతృప్తి లేదు. అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాము. అయితే కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల నేతలు, మీడియాలో ఓ వర్గం తెలంగాణ బిజెపిలో ఏదో అనర్ధం జరిగిపోయిందన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. బిజెపి గ్రాఫ్ పడిపోయిందంటూ ఏదేదో నోటికి వచ్చిన్నట్లు మాట్లాడేస్తున్నారు. బిజెపి గ్రాఫ్ ఏమీ సెన్సెక్స్ గ్రాఫ్ కాదు అకస్మాత్తుగా పడిపోవడానికి... పైకి లేవడానికి. రాష్ట్రంలో బిజెపి చాప కింద నీరులా రాష్ట్రమంతటా వ్యాపించి బలపడింది.
ఈ రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకొంటూ లక్షల కోట్లు అవినీతి సొమ్ము వెనకేసుకువస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మేమే గద్దె దించుతాము. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం. కనుక రాష్ట్ర ప్రజలు బిజెపికి వ్యతిరేకంగా జరుగుతున్న ఇలాంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని ఈటల రాజేందర్ అన్నారు.