కేసీఆర్‌కు పీఎంవో నుంచి ఆహ్వానం... వెళ్తారా?

తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఢిల్లీ నుంచి బిజెపి పెద్దలు రాష్ట్ర పర్యటనలు ప్రారంభించారు. ఎల్లుండి శనివారం ప్రధాని నరేంద్రమోడీ వరంగల్‌ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇది ప్రధాని అధికారిక పర్యటన కనుక ఆనవాయితీ ప్రకారం ఈ కార్యక్రమాలలో సిఎం కేసీఆర్‌ని పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తూ ప్రధాని కార్యాలయం తెలంగాణ సిఎం కార్యాలయానికి లేఖ పంపింది. 

ప్రధాని ఏదైనా రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఆ రాష్ట్ర గవర్నర్‌, సిఎం, డిజిపి, సిఎస్ ఆయనకు విమానాశ్రయంలో ఆహ్వానం పలికి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు వీడ్కోలు పలకవలసి ఉంటుంది. అయితే గత రెండు మూడేళ్ళుగా రాజకీయ కారణాలతో కేంద్రప్రభుత్వంపై కత్తులు దూస్తున్న సిఎం కేసీఆర్‌, ప్రధానికి మొహం చాటేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ని పంపించి సరిపెడుతున్నారు. కనుక ఎల్లుండి ప్రధాని పర్యటనకు వచ్చినప్పుడు మళ్ళీ అదే చేస్తారని భావించవచ్చు. 

ప్రధాని నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా రాష్ట్ర బిజెపి హన్మకొండలో 15 లక్షల మందితో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆ సభకు హాజరయ్యేందుకే ప్రధాని నరేంద్రమోడీ వరంగల్‌ వస్తున్నారు. ఆ సభలో ప్రధాని నరేంద్రమోడీ సిఎం కేసీఆర్‌ కుటుంబ పాలన, అవినీతి, అక్రమాల గురించి మాట్లాడటం ఖాయం. 

కనుక తన ప్రభుత్వంపై రాజకీయంగా దాడి చేయడానికి వస్తున్న ప్రధాని మోడీతో కలిసి సిఎం కేసీఆర్‌ అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారనుకోవడం రాజకీయ అజ్ఞానమే. అయినా ప్రోటోకాల్ ప్రకారం ప్రధానికి విమానాశ్రయంలో స్వాగతం పలకడానికే ఇష్టపడని సిఎం కేసీఆర్‌, ఆయనతో కలిసి అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారనుకోవడం అత్యాశే కదా?