ఆదివాసి కాళ్ళు కడిగి క్షమాపణలు చెప్పిన ముఖ్యమంత్రి

రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సీధి జిల్లాలో ఓ ఆదివాసి యువకుడిపై ప్రవేష్ శుక్లా అనే యువకుడు మూత్ర విసర్జన చేశాడు. అతను స్థానిక బిజెపి ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో వెంటనే రాహుల్ గాంధీతో సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు ‘బిజెపి పాలనలో బడుగు బలహీనవర్గాల ప్రజలకు కనీసం గౌరవం లేకుండాపోతోందంటూ’ తీవ్ర విమర్శలు గుప్పించారు.

అతనితో తమ పార్టీకి ఎటువంటి సంబందమూ లేదని నిరూపించేందుకు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌ అతనిపై తీవ్ర చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు పోలీసులు ప్రవేష్ శుక్లాపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయగా, సీధీ జిల్లా రెవెన్యూ అధికారులు అనుమతి లేకుండా ఇల్లు నిర్మించాడంటూ అతని ఇంటిని జేసీబీతో కూల్చివేయించారు.

ఈరోజు ఉదయం ఆ ఆదివాసి యువకుడుని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌ భోపాల్లోని తన అధికార నివాసానికి పిలిపించుకొని, స్వయంగా తన చేతులతో అతని కాళ్ళు కడిగి క్షమాపణలు చెప్పారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సభ్యసమాజం సిగ్గుతో తల దించుకొనేలా ఉన్న ఈ ఘటన నాకు చాలా బాధ కలిగించింది. ఇది చాలా తప్పు. సహించరాని నేరం. అందుకే హేయమైన చర్యకు పాల్పడిన ఆ వ్యక్తిని చట్ట ప్రకారం శిక్షించి, బాధితుడి కాళ్ళు కడిగి క్షమాపణ చెప్పాను. ప్రజలందరూ నాకు సమానమే. ఎవరూ ఎక్కువా కాదు... తక్కువా కాదు. కనుక ఇటువంటి దుశ్చర్యలకు ఎవరు పాల్పడినా క్షమించే ప్రసక్తే లేదు,” అని అన్నారు. 

ప్రవేష్ శుక్లా చేసిన పని ఎంతగా వైరల్ అయ్యిందో, ముఖ్యమంత్రి ఆదివాసి యువకుడి కాళ్ళు కడిగిన వీడియో కూడా అంతే వైరల్ అవుతోంది. తద్వారా ఆయన చాలా తెలివిగా కాంగ్రెస్‌ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టిన్నట్లు అర్దమవుతోంది.