మజ్లీస్ పార్టీలో నాలుగో తరం నేత ప్రత్యక్ష రాజకీయాలలోకి రాబోతున్నారు. ఆయనే మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కుమారుడు డాక్టర్ నూరుద్దీన్ ఓవైసీ. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం ఉన్నతవిద్యను అభ్యసిస్తూనే, మజ్లీస్ పార్టీ అధ్వర్యంలో పాతబస్తీలో నడుస్తున్న సలార్-ఎ-మిలత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు ట్రస్టీగా, కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆయన వైద్య రంగంలోనే స్థిరపడాలనుకొంటున్నప్పటికీ, తండ్రి, పెద్దనాన్న అసదుద్దీన్ ఓవైసీ ప్రత్యక్ష రాజకీయాలలోకి రావలసిందిగా ఒత్తిడి చేస్తున్నారు. మజ్లీస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా డాక్టర్ నూరుద్దీన్ ఓవైసీని ప్రత్యక్ష రాజకీయాలలోకి తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారు.
ఇటీవల దారుస్సలామ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓవైసీలు ఎన్నికల సన్నాహల గురించి పార్టీ నేతలతో చర్చించినప్పుడు, వచ్చే ఎన్నికలలో తప్పనిసరిగా డాక్టర్ నూరుద్దీన్ ఓవైసీని పోటీ చేయించాలని వారు పట్టుపట్టిన్నట్లు తెలుస్తోంది. కనుక వచ్చే ఎన్నికలలో చంద్రాయణగుట్ట లేదా బహదూర్ పురాలో ఏదో ఓ నియోజకవర్గం నుంచి డాక్టర్ నూరుద్దీన్ ఓవైసీని బరిలో దింపాలని ఓవైసీలు భావిస్తున్నారు. ఒకవేళ అందుకు ఆయన ఒప్పుకొంటే ఓవైసీల కుటుంబంలో నాలుగో తరం ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చేస్తుంది.