
ప్రస్తుతం ఢిల్లీలో బిజెపి కేంద్ర కార్యాలయంలో ఉన్న తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, అధిష్టానం ఆదేశం మేరకు కొద్ది సేపటి క్రితం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డిని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు నియమించింది.
బండి సంజయ్ వైఖరిపై పార్టీలో ఈటల రాజేందర్, రఘునందన్ రావు, జితేందర్ రెడ్డి తదితర పలువురు సీనియర్ నేతలు పిర్యాదులు చేయడంతో పదవిలో నుంచి తప్పించిన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీకి జీవం పోసి బిఆర్ఎస్‌ను గడగడలాడించిన బండి సంజయ్‌ని ఎన్నికలకు 4-5 నెలల మాత్రమే సమయం ఉన్నప్పుడు తప్పించి, మృధుభాషి అయిన కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పజెప్పితే బిజెపియే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. బండి సంజయ్ తొలగింపు వలన పార్టీ రెండు వర్గాలుగా చీలిపోతే ఇంకా నష్టపోవచ్చు. అయినప్పటికీ బండి సంజయ్‌ని తొలగించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడుగా నియమించడం కాస్త ఆశ్చర్యకరమైన నిర్ణయమే అని భావించవచ్చు.
ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజుని కూడా ఆ పదవిలో నుంచి తప్పించి ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరికి ఏపీ బిజెపి అధ్యక్షురాలిగా నియమించింది. రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల మార్చిన్నట్లు బిజెపి జాతీయ కార్యదర్శి అరుణ్ కుమార్ ఢిల్లీలో కొద్ది సేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు.