నేడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. నగరంలో గచ్చిబౌలి స్టేడియంలో జరుగబోయే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ వస్తున్నారు.
ఈరోజు ఉదయం 10 గంటలకు ఆమె ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళతారు. మధ్యాహ్నం 3 గంటలకు గచ్చిబౌలి చేరుకొని అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలలో పాల్గొంటారు. తర్వాత హకీంపేట చేరుకొని మహారాష్ట్రకు బయలుదేరి వెళతారు.
కనుక ఆమె నగరంలో తిరిగే సమయంలో ఆయా మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలుచేయబోతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు హకీంపేట వై జంక్షన్, బొల్లారం చెక్ పోస్ట్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్, హెలీప్యాడ్ వై జంక్షన్, బైసన్ గేట్, లోత్ కుంట ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఆ సమయంలో ఈ ప్రాంతాలలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేయబడతాయని తెలిపారు.
ప్రత్యేకించి బొల్లారం, ఆల్వాల్, లోత్ కుంట, త్రిమూల్ ఘేరి, జేబీఎస్, ప్లాజా జంక్షన్, పీఎన్‌టి ఫ్లైఓవర్ ప్రాంతాలలో ఈరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాహనాలను వేరే మార్గాలలోకి మళ్ళించబోతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు. కనుక వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో తమ గమ్యస్థానాలు చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.