బండి సంజయ్‌కి వంద కోట్లు ఎక్కడివి? రఘునందన్

ఇంతకాలం రాష్ట్ర బిజెపికి చెదలు పట్టి లోలోన పుచ్చిపోతున్నప్పటికీ పైకి బలంగానే కనిపించింది. కానీ నాలుగేళ్ళు ఏ శాసనసభ ఎన్నికల కోసమైతే కష్టపడ్డారో అవిప్పుడు దగ్గర పడినప్పుడు పార్టీలో నేతల మద్య విభేధాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. దీంతో తెలంగాణ బిజెపి ఆకాశమంత ఎత్తుకు ఎగిరి ఒక్కసారిగా పాతాళంలో పడిపోయినట్లు కుప్పకూలిపోతోంది. 

బిజెపిని కాపాడేందుకు అధిష్టానం ఓ వైపు ప్రయత్నిస్తుండగా సీనియర్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మరోసారి అసంతృప్త స్వరం వినిపించారు. ఈసారి ఆయన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడంతో పార్టీలో కలకలం మొదలైంది. 

ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, “నేను దుబ్బాక నుంచి పోటీ చేసి గెలిచాను గాబట్టే ఈటల రాజేందర్‌ పార్టీలో చేరారు. హుజురాబాద్‌లో ఆయన గెలుపు కోసం కూడా నేను చాలా శ్రమించాను. కానీ ఇంతగా కష్టపడి పనిచేస్తుంటే, బండి సంజయ్‌ తనొక్కడే పార్టీని నడిపిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికలలో భార్య మెడలో పుస్తెలతాడు అమ్మి పోటీ చేసిన బండి సంజయ్‌, ఇప్పుడు పేపర్లలో ప్రకటనలు ఇచ్చుకొనేందుకు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?

మునుగోడు ఉపఎన్నికలలో వంద కోట్లు ఖర్చు పెట్టినా బిజెపి గెలవలేదని నాకు తెలుసు. అదే వంద కోట్లు నా చేతికి ఇచ్చి ఉంటే తెలంగాణలో బిజెపిని తిరుగులేని శక్తిగా మార్చగలిగేవాడిని. నేను పదేళ్ళుగా బిజెపి కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నాను. కానీ పార్టీలో గుర్తింపే లేదు. అధ్యక్ష పదవికి నేను అర్హుడిని కానా?రాజా సింగ్‌ను పార్టీలో నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కనీసం నాకు ఫ్లోర్ లీడర్ పదవి ఇమ్మనమని అడిగినా ఇవ్వలేదు. ఎంత కష్టపడి పనిచేస్తున్నా గుర్తింపు లేనప్పుడు నేను ఎవరి కోసం పనిచేయాలి? ఎందుకు చేయాలి?” అని అన్నారు.