
ఈ నెల 8న ప్రధాని నరేంద్రమోడీ హన్మకొండలో బిజెపి అధ్వర్యంలో జరుగబోయే విజయ సంకల్పసభలో పాల్గొనేందుకు రాబోతున్నారు. కనుక ప్రధాని సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం హన్మకొండలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ప్రధాని సభకు నేను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు హోదాలో వస్తానో రానో తెలీదు. బిజెపి అంటే త్యాగాల పార్టీ. రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసే ప్రయత్నంలో ఎందరో కార్యకర్తలు పోలీసుల కేసులలో చిక్కుకొని జైళ్ళ పాలయ్యారు. కనుక నా విషయంలో పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకొన్నా దానికి నేను కట్టుబడి ఉంటాను. అందరం కలిసి 15 లక్షల మందిని జనసమీకరణ చేసి ప్రధాని సభను విజయవంతం చేద్దాము,” అని చెపుతూ భావోద్వేగానికి లోనయ్యారు.
కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డికి పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించి, బండి సంజయ్‌ని కేంద్రమంత్రి లేదా బిజెపి జాతీయ కార్యవర్గంలోకి తీసుకోబోతున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో బండి సంజయ్ ఈవిదంగా చెప్పడం ఆ వార్తలను ధృవీకరించినట్లే భావించవచ్చు. బండి సంజయ్‌కు సోమవారం పిలుపు రావడంతో ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు.