ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనగర్జన బహిరంగసభ విజయవంతం అయ్యింది. ఈ సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా వస్తుండటం, ఆయన సమక్షంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో అందరూ పూనుకొని జనసమీకరణ చేసి సభను విజయవంతం చేశారు.
ఈ సభలో రాహుల్ గాంధీ కేసీఆర్ ప్రభుత్వం మీద నిప్పులు చెరుగుతూ, కాంగ్రెస్ తరపున కొన్ని ఎన్నికల హామీలు ప్రకటించారు. ఆయన సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పిడమర్తి రవి, పాయం వెంకటేశ్వర్లు, అరికెల నర్సారెడ్డి తదితరులు కాంగ్రెస్లో చేరారు. ఈ సభలోనేభట్టి విక్రమార్క మూడు నెలలుగా చేస్తున్న తన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్రను ముగించారు.
ఈ సభలో రాహుల్ గాంధీ ఏమన్నారంటే, తెలంగాణ రాష్ట్రం తన జాగీర్ అని దానికి తాను రాజునని కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులలో అవినీతికి పాల్పడి లక్షల కోట్లు దోచుకొన్నారు. ధరణితో పేదల భూములు కూడా దోచుకొంటున్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, మరో 10-15 మంది చేతుల్లోకి ఆ సంపద అంతా వెళ్ళిపోయింది.
బిఆర్ఎస్ అంటే బిజెపి రిస్తేదార్ పార్టీ (బిజెపి బంధువుల పార్టీ). రెండు పార్టీల మద్య రహస్య అవగాహన ఉంది. బిజెపికి బిఆర్ఎస్ ఖచ్చితంగా బీ-టీమే. అందుకే అఖిలపక్ష సమావేశానికి బిఆర్ఎస్ని ఆహ్వానించవద్దని మేమే చెప్పాము.
కేసీఆర్ కాంగ్రెస్ను అడ్డుకొని బిజెపిని గెలిపించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. కర్ణాటకలో అలాగే చేశారు కానీ బిజెపి, బిఆర్ఎస్ ఎత్తులు పనిచేయలేదు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ను గెలిపించుకొన్నారు. అలాగే తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ అవినీతి పాలన నుంచి విముక్తి కోరుకొంటున్నారు.
వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది. అప్పుడు వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4,000 పింఛను ఇస్తాము. రాష్ట్రంలో పోడు భూములన్నీ అర్హులకు పంపిణీ చేస్తాము.
కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం కంచుకోట. కేసీఆర్తో సింహాల్లా పోరాడుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటివారందరూ మా పార్టీలో చేరడం చాలా శుభపరిణామం. వివిద కారణాలతో కాంగ్రెస్ వీడి వెళ్ళిపోయిన వారి కోసం పార్టీ తలుపులు తెరిచే ఉంచాము. కేసీఆర్ అవినీతి పాలనను వ్యతిరేకిస్తున్న వారందరూ కాంగ్రెస్లో రావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను,” అని రాహుల్ గాంధీ అన్నారు.