నేడే కేసీఆర్‌, కేటీఆర్‌ చేతుల మీదుగా పోడు భూముల పంపిణీ

బిఆర్ఎస్ ఎన్నికల వాగ్ధానాలలో గిరిజనులకు పోడు భూముల పంపిణీ కూడా ఒకటి. చిరకాలంగా పెండింగులో ఉన్న ఈ హామీని నేడు కేసీఆర్‌ నెరవేర్చనున్నారు. ఈరోజు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించి అక్కడ కొమురం భీమ్ విగ్రహావిష్కరణ చేస్తారు. తర్వాత కొత్తగా నిర్మించిన బిఆర్ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని, పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని, సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.  

సిఎం కేసీఆర్‌ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సిద్ధిపేటలో తన ఫామ్‌హౌస్‌ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 12.30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొంటారు. ఆ తర్వాత వరుసగా అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నాక లబ్ధిదారులకు పోడు భూములు పంపిణీ చేస్తారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఉద్యోగులను ఉద్దేశ్యించి ప్రసంగించిన తర్వాత సాయంత్రం 5 గంటలకు మళ్ళీ హెలికాఫ్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరుతారు. సాయంత్రం 6.15 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో దిగి రోడ్డు మార్గంలో ప్రగతి భవన్ చేరుకొంటారు. 

మంత్రి కేటీఆర్‌ కూడా నేడు మహబూబాబాద్‌లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వాటిలో రూ.5 కోట్లతో నిర్మించిన సమీకృత మార్కెట్‌ని ప్రారంభిస్తారు. గుమ్మడూర్‌లో నిర్మించిన 200 డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ళను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. తర్వాత స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియంలో 24,181 మంది పోడు రైతులకు 67,730 ఎకరాలు భూమి పట్టాలు అందజేసి వారితో కలిసి భోజనం చేస్తారు. సాయంత్రం హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం అవుతారు.