జూలై 2న రాహుల్, 8న ప్రధాని మోడీ... తెలంగాణకు

తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఢిల్లీ నుంచి కాంగ్రెస్‌, బిజెపి పెద్దల పర్యటనలు మొదలైపోయాయి.

జూలై 2న కాంగ్రెస్‌ యువరాజు రాహుల్ గాంధీ ఖమ్మంలో జరుగబోయే భారీ బహిరంగసభలో పాల్గొనబోతున్నారు. ఈ సభలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో సహా పలువురు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వంద ఎకరాల స్థలంలో 5 లక్షల మందితో ఈ సభను నిర్వహించేందుకు పొంగులేటి చాలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

జూలై 8వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ వరంగల్లో పర్యటించనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని బిఆర్ఎస్‌ నేతలు వాదిస్తుండటంతో వారి ఆరోపణలకు జవాబుగా కాజీపేటలో రైల్వే వ్యాగన్స్ ఓవర్‌తో హాలింగ్ సెంటర్‌కు ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే వరంగల్‌ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు కూడా ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత అక్కడే బిజెపి అధ్వర్యంలో నిర్వహించబోయే సభలో ప్రసంగించనున్నారు.

ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ఖరారు కావడంతో జూలై 8న దేశంలో 111 రాష్ట్రాల బిజెపి అధ్యక్షులతో జేపీ నడ్డా సమావేశం వాయిదా పడింది.

కాంగ్రెస్‌, బిజెపి బహిరంగసభలలో సిఎం కేసీఆర్‌, ఆయన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్రమోడీ విమర్శలు, ఆరోపణలు చేయడం ఖాయం. కనుక బిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీల మద్య మళ్ళీ కొన్ని రోజులపాటు హోరాహోరీగా మాటల యుద్ధాలు జరగడం కూడా ఖాయమే.