19.jpg)
గత కొన్ని రోజులుగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కి, పార్టీలో సీనియర్ నేతలకి, ముఖ్యంగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పొసగడం లేదని, వారు ఢిల్లీ వెళ్ళి బిజెపి అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తుండటంతో, బండి సంజయ్ స్థానంలో మరొకరిని నియమించబోతోందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వీటిపై కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి స్పందిస్తూ, “తెలంగాణ శాసనసభ ఎన్నికలకు కేవలం 4-5 నెలలు మాత్రమే సమయం ఉంది. ఇటువంటి సమయంలో ఏ పార్టీ అయినా అధ్యక్షుడుని మార్చుతుందా? బండి సంజయ్‌ని మార్చుతున్నట్లు పుకార్లు ఎవరు పుట్టించారో తెలీదు కానీ అవి వాస్తవం కాదు. బిజెపి అధిష్టానం అటువంటి ఆలోచన ఏదీ చేయడం లేదు,” అని చెప్పారు.
బండి సంజయ్ స్వయంగా ఈ పుకార్లపై స్పందిస్తూ, “దాదాపు ఏడాదిగా బిజెపిలో నిప్పు రాజేద్దామని ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ నిప్పూ లేదు పొగ లేదు. ఇలాంటి నీచమైన రాజకీయాలు కేసీఆర్ మాత్రమే చేస్తారు. ఆయన తన పార్టీలో గొడవలను చక్కబెట్టుకోకుండా ఇలా ఇతర పార్టీలను ఎలా దెబ్బ తీయాలని ఎప్పుడు కుట్రలు పన్నుతుంటారు. అయితే ఇతరుల కోసం గోతులు తవ్వితే ఏదోనాడు వాటిలో ఆయనే పడతారని గ్రహిస్తే మంచిది,” అని అన్నారు.