తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇద్దరు అధికారులు ఖరారు

ఈ ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ శాసనసభ గడువు ముగుస్తుంది. కనుక సెప్టెంబర్‌-అక్టోబర్ నెలల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కనుక కేంద్ర ఎన్నికల కమీషన్‌కు తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించింది. జీహెచ్‌ఎంసీ కమీషనర్ లోకేష్‌ కుమార్‌, ఎక్సైజ్ శాఖ కమీషనర్ సర్పరాజ్ అహ్మద్‌లను శాసనసభ ఎన్నికల అధనపు ప్రధాన అధికారి, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారులుగా నియమించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమీషన్‌కు బుదవారం ఉత్తర్వులు జారీచేసింది. 

కనుక ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు వీలుగా వారిరువురినీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి అప్పగించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ పంపింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమీషన్‌ బృందాలు రెండుమూడు సార్లు హైదరాబాద్‌లో పర్యటించి రిటర్నింగ్ అధికారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశాయి. మళ్ళీ ఇటీవలే హైదరాబాద్‌లో మరోమారు పర్యటించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిజిపి అంజని కుమార్‌, వివిద శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యి ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్ల గురించి చర్చించారు.