మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “త్వరలో జరురుగబోయే ఎన్నికలలో పోటీ చేసేందుకు కేసీఆర్ నాకు టికెట్ ఇవ్వకపోతే బిఆర్ఎస్ వీడేందుకు ఏమాత్రం వెనకాడను. నా కోడలు డాక్టర్ అనితా రెడ్డి రంగారెడ్డి జెడ్పీ ఛైర్ పర్సన్‌గా ఉన్నారు కనుక ఒక ఇంట్లో రెండు పదవులు కుదరవని చెపుతున్నారు. ఆ లెక్కన కేసీఆర్ ఇంట్లోనే ఐదుగురికి పదవులు లభించాయి కదా? కనుక ఈ సాకుతో నాకు టికెట్ నిరాకరిస్తే అంగీకరించే ప్రసక్తేలేదు.
నేను కేసీఆర్‌తో సమానంగా రాజకీయాలలో ఉన్నాను. ఉద్యమాలలో పాల్గొన్నాను. నావంటివారిని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి కూడా ఇచ్చి కేసీఆర్ పెద్ద తప్పు చేశారు. పార్టీలో ఉద్యమకారులకు చోటు లేకుండా పోయింది. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరినవారికే పదవులు లభిస్తున్నాయి,” అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మహేశ్వరం నియోజకవర్గానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. మళ్ళీ ఆమెకే టికెట్ కేటాయించడం కూడా ఖాయమే. ఈ విషయం మాజీ ఎమ్మెల్యే తీగలకు తెలుసు కనుకనే కేసీఆర్‌ని ఉద్దేశ్యించి ఇంత ఘాటుగా మాట్లాడారనుకోవచ్చు.
ఆయనకు ఎలాగూ టికెట్ లభించదు కనుక పార్టీ మారడం కూడా ఖాయమే. కాంగ్రెస్, బిజెపిలలో తలుపులు తెరిచే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం చాలా పోటీ ఉంటుంది. కానీ బిజెపిలో ఉండదు. కనుక ఆయన బిజెపిలో చేరే అవకాశం కనిపిస్తోంది.