బిజెపి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భార్య ఈటల జమున మంగళవారం హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టి సిఎం కేసీఆర్, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. “హుజురాబాద్లో నా భర్తను ఓడించేందుకు కేసీఆర్ కోట్లు రూపాయలు పంచిపెట్టారు. మద్యం ఏరులైపారించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ హుజురాబాద్లో దింపారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ఉద్యమకారుడైన నా భర్తనే బారీ మెజార్టీతో గెలిపించి బుద్ధి చెప్పారు.
అయినా ఇంకా బుద్ధి వచ్చిన్నట్లు లేదు. పాడి కౌశిక్ అనే పిచ్చి కుక్కకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి హుజురాబాద్ మీదకు వదిలారు. అతను అక్కడ నానా అరాచకాలు చేస్తూ, ప్రజలను భయబ్రాంతులని చేసి గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆనాడు ఉద్యమకారులపై రాళ్ళు వేయించిన పాడి కౌశిక్ రెడ్డికి హుజురాబాద్లో అమరవీరుల స్తూపం తాకేందుకు కూడా అర్హత లేదు. అటువంటిది దానిపై శిలాఫలకం మీద నా భర్త పేరుందని జేసీబీతో ఆ స్తూపం కూల్చివేయించారు. తెలంగాణ కోసం పోరాడిన ఆ అమరవీరులను, రాష్ట్ర ప్రజలను అవమానించడమే అని నేను భావిస్తున్నాను.
అయితే కేసీఆర్ ఆమోదం లేకుండా పాడి కౌశిక్ రెడ్డి ఇంత సాహసానికి పూనుకోలేరు. అందుకే ఆయనపై ఇంతవరకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వచ్చే ఎన్నికలలో నా భర్తపై గెలవడం కష్టం కనుక పాడి కౌశిక్ రెడ్డి నా భర్తను చంపించేందుకు రూ.20 కోట్లు సుపారీ ఇచ్చేందుకు సిద్దమని చెప్పిన్నట్లు మావద్ద సమాచారం ఉంది. చివరికి కేసీఆర్, పాడి కౌశిక్ రెడ్డి ఈ దుస్థితికి దిగజారిపోయారన్న మాట!
అయితే ఇటువంటి బెదిరింపులకు భయపడే కుటుంబం కాదు మాది. హుజురాబాద్ ఉపఎన్నికలలో ప్రజలు మమ్మల్ని ఏవిదంగా కేసీఆర్ బారి నుంచి కాపాడుకొన్నారో, అదేవిదంగా ఈ పాడి కౌశిక్ రెడ్డి, అతని వెనుకున్న సిఎం కేసీఆర్ నుంచి కూడా మరోసారి కాపాడుకొంటారు. పాడి కౌశిక్ రెడ్డి, అతని వెనుకున్న సిఎం కేసీఆర్ను మేము ధైర్యంగా ఎదుర్కొంటాము. ఒకవేళ మా ఇద్దరికీ ఏదైనా జరిగితే దానికి వారిద్దరిదే పూర్తి బాధ్యత,” అని అన్నారు.