తెలంగాణకు రూ.2,102 కోట్లు విడుదల

కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో దేశంలో 16 రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కింద రూ.56,415 కోట్లు విడుదల చేస్తోంది. దీనిలో తెలంగాణ రాష్ట్రానికి రూ.2,102 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రాష్ట్రాల అభివృద్ధి కొరకు ప్రత్యేక సాయంగా మొత్తం రూ.1.3 లక్షల కోట్లు వడ్డీ లేని రుణంగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.

దీనిని ఆయా రాష్ట్రాలు 50 ఏళ్ళలో తిరిగి తీర్చవలసి ఉంటుంది. దానిలోనే తొలివిడతగా రూ.56,415 కోట్లు విడుదల చేయబోతోంది. కేంద్ర ఆర్ధికశాఖ ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసినందున త్వరలోనే రాష్ట్రాలకు ఈ నిధులు విడుదల కానున్నాయి.

ఈ సొమ్ముని మౌలికవసతుల కల్పన, విద్యా, వైద్యం తదితర అవసరాలకు వినియోగించుకోవచ్చు. అయితే దీనిలో ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాలకు నిధులు కేటాయించలేదు. బిహార్‌ రాష్ట్రానికి అత్యధికంగా రూ. 9,640 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం వివిద పధకాలు, పన్నులలో వాటాగా రాష్ట్రాలకు చెల్లిస్తున్న సొమ్ముకి ఇది అదనంగా ఇస్తోంది. 

తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని బిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపిస్తుంటారు. వారి ఆరోపణలు తప్పని నిరూపిస్తూ కేంద్ర ప్రభుత్వం మిగిలిన 15 రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కూడా రో.2,102 కోట్లు మంజూరు చేసింది. అయితే కేంద్రం నిధులు ఇవ్వడం లేదని విమర్శించే బిఆర్ఎస్‌ నేతలు, ఇటువంటప్పుడు మౌనంగా ఉండిపోతుంటారు. ఎందువల్ల?