జగిత్యాల జిల్లాలో కొత్త మండలం ఏర్పాటుకు ప్రతిపాదిస్తూ రాష్ట్ర రెవెన్యూశాఖ సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. మెట్పల్లి మండలం నుంచి రాజేశ్వరరావుపేట, మేడిపల్లి (డబ్ల్యూ), రామచంద్రంపేట, విట్టంపేట, మెట్ల చిత్తాపూర్, జగ్గాసాగర్, రామలచ్చక్కపేట, రంగారావుపేట, బండలింగాపూర్, ఆత్మకూరు గ్రామాలను 10 గ్రామాలను వేరుచేసి బండలింగాపురం కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. ఇది ఏర్పాటైతే దీనితో కలిపి రాష్ట్రంలో మండలాల సంఖ్య 613కి చేరుకొంటుంది.
దీని కోసం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా జగిత్యాల జిల్లా కలెక్టర్‌ను రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశించారు. దీనిపై ప్రజలకు, ప్రతిపక్షాలకు, వేరెవారికైనా అభ్యంతరాలున్నట్లయితే 15 రోజులలో జిల్లా కలెక్టరుకు లిఖితపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది.
సంగారెడ్డి జిల్లాలో గ్రామం మార్పు: సంగారెడ్డి జిల్లాలోని నారాయణ ఖేడ్ రెవెన్యూ డివిజన్లోని కంగ్టి మండలంలో గల బాబుల్ గావ్‌ను గ్రామాన్ని కామారెడ్డి జిల్లా బాన్సువాడ రెవెన్యూ డివిజన్లోని పెద్దకొడప్గల్ మండలంలోకి బదిలీ చేస్తూ రెవెన్యూశాఖ సోమవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది.