తెలంగాణ సిఎం కేసీఆర్ తన మంత్రులు, ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని 600 కార్లతో భారీ ర్యాలీగా మహారాష్ట్రలో రెండు రోజుల పర్యటనకు రావడంపై, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు థాక్రే స్పందిస్తూ, “కేసీఆర్ తెలంగాణలో దోచుకొన్న సంపదను ఇతర రాష్ట్రాలలో ఖర్చు చేసి అధికారంలోకి రావాలనుకొంటున్నారు. అయితే మహారాష్ట్రలో ఆయన ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకోలేరు. గెలుచుకొంటే నేను రాజకీయాల నుంచి తప్పుకొంటాను,” అని సవాలు విసిరారు.
కేసీఆర్ వందల కార్లు వేసుకొని మహారాష్ట్రకు రావడాన్ని పెద్ద డ్రామా అభివర్ణించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ఓడించి బిజెపిని గెలిపించేందుకు కేసీఆర్ డబ్బు మూటలు పంపించారని, అదేవిదంగా ఇక్కడ మహారాష్ట్రలో కూడా బిజెపిని మళ్ళీ అధికారంలోకి తెచ్చేందుకు, కాంగ్రెస్ను అడ్డుకొనేందుకే కేసీఆర్ ఈ కొత్త డ్రామా మొదలుపెట్టారని మాణిక్రావు థాక్రే అన్నారు.
కేసీఆర్ ఎప్పుడూ మోడీతో విభేదించలేదని, విభేధిస్తున్నట్లు నటిస్తున్నారని అన్నారు. కేసీఆర్ బిజెపిని వ్యతిరేకిస్తున్నట్లయితే పాట్నాలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఎందుకు రాలేదని మాణిక్రావు థాక్రే ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, దానిని కేసీఆర్, ఆయన కుటుంబం కలిసి దోచుకొన్నారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి, కుటుంబపాలనతో ప్రజలు విసుగెత్తిపోయున్నారని కనుక రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని మాణిక్రావు థాక్రే అన్నారు.
“లోక్సభ ఎన్నికల తర్వాత ఒకవేళ కేంద్రంలో బిజెపి మళ్ళీ అధికారంలోకి రాకపోతే కేసీఆర్ కాంగ్రెస్తో చేతులు కలుపుతారట కదా?” అని విలేఖరి ప్రశ్నించగా, “ఒకవేళ ఆయన అందుకు సిద్దపడినా కాంగ్రెస్ పార్టీ అంగీకరించదు. భవిష్యత్లో ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనను దగ్గరకు రానీయదు. ఆయన కారణంగా తెలంగాణ కాంగ్రెస్ చాలా నష్టపోయింది. అటువంటి కేసీఆర్తో మేమేందుకు చేతులు కలుపుతాము?అయినా బిఆర్ఎస్ బిజెపికి బీ-టీంగా పనిచేస్తోంది కదా?కనుక కేసీఆర్తో మాకు పోరాటమే తప్ప స్నేహం ఉండదు,” అని మాణిక్రావు థాక్రే చెప్పారు.