నేడు మహారాష్ట్రకు కేసీఆర్‌ ప్రయాణం... రెండు రోజులు అక్కడే

మహారాష్ట్రలో బిఆర్ఎస్‌ పార్టీ విస్తరణకు అనుకూల రాజకీయ, సామాజిక పరిస్థితులు నెలకొని ఉండటంతో సిఎం కేసీఆర్‌ ఆ రాష్ట్రంపై దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 10గంటలకు ప్రగతి భవన్‌ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రలోని ధారశివ జిల్లాలోని ఒమర్గాకు బయలుదేరారు.

అక్కడ మధ్యాహ్నం భోజన విరామం తర్వాత మళ్ళీ బయలుదేరి సోలాపూర్ చేరుకొంటారు. మంగళవారం ఉదయం అక్కడి నుంచి బయలుదేరి పండరీపురం చేరుకొని అక్కడ విఠోబా రుక్మిణీ ఆలయంలో ప్రత్యేకపూజలు చేస్తారు. తర్వాత సోలాపూర్ జిల్లాలోని సర్కోలి గ్రామంలో జరిగే సభలో పాల్గొంటారు. బహిరంగసభలో ముగిసిన తర్వాత ధారాశివ్ జిల్లాలోని తూల్జాభవానీ అమ్మవారి శక్తిపీఠం దర్శించుకొని హైదరాబాద్‌ తిరుగుప్రయాణం అవుతారు. 

ప్రతీసారి హైదరాబాద్‌ నుంచి విమానంలో నాందేడ్ చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన్న పర్యటించే కేసీఆర్‌ ఈసారి హైదరాబాద్‌ నుంచే రోడ్డు మార్గంలో వందల కార్లు వేసుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వెంటబెట్టుకొని బయలుదేరుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

మహారాష్ట్రలో ఇప్పటికే పలు జిల్లాలలో బిఆర్ఎస్‌ పార్టీని విస్తరించారు కనుక కేసీఆర్‌ పర్యటనకు ఆ రాష్ట్రంలో బిఆర్ఎస్‌ నేతలు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కనుక ఈసారి తమ బలం చాటుకొనేందుకే కేసీఆర్‌ ఈవిదంగా చేస్తున్నారని భావించవచ్చు.