ప్రస్తుతానికి బిజెపిలోనే ఉన్నా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరి ఉపఎన్నికలు తెచ్చిపెట్టినందుకు స్వయంగా మూల్యం చెల్లించడమే కాకుండా పార్టీకి కూడా ఆయన వలన ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి పలువురు నేతలు చేరేందుకు సిద్దం అవుతున్నారు. వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఒకరని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

తెలంగాణ కాంగ్రెస్‌కు మాణిక్‌రావు థాక్రే ఇన్‌ఛార్జ్‌ అయినప్పటికీ, కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివకుమార్ తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాలు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పిలుపు మేరకు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెంగళూరు వెళ్ళి ఆయనతో భేటీ అయ్యారు. ఎలాగైనా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మళ్ళీ కాంగ్రెస్‌లోకి తీసుకురావలనేది ఆ భేటీ సారాంశం. ఆయనతో పాటు మరికొందరు బిజెపిలో అసంతృప్తిగా ఉన్న ఈటల రాజేందర్‌ వంటివారిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నించాలని శివకుమార్ కోరిన్నట్లు తెలుస్తోంది. 

దీంతో బిజెపి అధిష్టానం అప్రమత్తమై వెంటనే ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను ఢిల్లీకి రావాలని కబురు పంపించింది. వారితోపాటు కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డిని కూడా ఢిల్లీకి రావాలని ఆదేశించడంతో ఆయన కూడా ఈరోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నప్పుడు శంషాబాద్ విమానాశ్రయం వద్ద మీడియా ప్రతినిధులు “పార్టీ మారుతున్నారా?” అని ప్రశ్నించగా ఆయన “ప్రస్తుతానికి బిజెపిలోనే ఉన్నాను,” అంటూ జవాబు చెప్పడం విశేషం. అంటే పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు భావించవచ్చు. అయితే బిజెపిలో చేరేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయనకు రూ.1800 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది. కనుక బయటకు వెళ్లాలంటే కాస్త ఆలోచించుకోవలసిందే.