స్టేషన్‌ఘన్‌పూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ హన్మకొండ జిల్లా, ధర్మసాగర్ మండలంలోని జానకీపురం గ్రామ సర్పంచ్ నవ్య ఈ నెల 21న చేసిన ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆమె ఎమ్మెల్యేతో పాటు ఆయన పీఏ శ్రీనివాస్, ఎంపీపీ నిమ్మ కవిత, తన భర్త ప్రవీణ్‌పై కూడా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై తాను చేసిన లైంగిక ఆరోపణలు రాజకీయ దురుదేశ్యంతో చేశానని అంగీకరిస్తూ స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి ఇవ్వాలని వారు తనపై ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. వారు తన భర్త ప్రవీణ్‌ను కూడా బెదిరించి భయపెట్టి అతని ద్వారా కూడా తనపై ఒత్తిడి చేస్తున్నారని నవ్య తన పిర్యాదులో పేర్కొన్నారు. కనుక వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
అయితే ఎమ్మెల్యే రాజయ్య అధికార పార్టీకి చెందినవారు కావడంతో పోలీసులు ఆమె ఫిర్యాదుపై ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో రాష్ట్ర, జాతీయ మహిళా కమీషన్లు ఈ కేసును సుమోటుగా స్వీకరించి, ఈ వ్యవహారంపై తక్షణం విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించాయి.
మహిళా కమీషన్ ఆదేశంపై స్పందిస్తూ కాజీపీట ఏసీపీ, ధర్మాసాగర్ పోలీస్ స్టేషన్ (ఎస్సై) ఆమెకు నోటీసులు పంపాయి. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లైంగికంగా వేధిస్తున్నట్లు ఆమె వద్ద ఫోన్ రికార్డ్స్, పత్రాలు, లేదా మారేవైనా సాక్ష్యాధారాలు ఉంటే రెండు రోజులలోగా వాటిని తమకు సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు.
మూడు నెలల క్రితం అధిష్టానం ఆదేశం మేరకు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆమె ఇంటికి వెళ్ళి తాను ఆమెతో అసభ్యంగా ప్రవర్తించలేదని, కానీ ఆమె తన వలన బాధపడుతున్నట్లు తెలుసుకొనివచ్చానని చెపుతూ ఆమెకు మీడియా ఎదుటే క్షమాపణలు చెప్పారు.
జానకీపురం అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కోటా నుంచి రూ.50 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ వార్త అన్ని ప్రధాన న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్లలో వచ్చింది కూడా.
అయితే ఆ తర్వాత తనకు పైసా ఇవ్వకుండానే రూ.25 లక్షలు ఇచ్చిన్నట్లు గ్రామంలో దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయినా గ్రామాభివృద్ధి పనులకు డబ్బు ఇవ్వాలంటే తాను చేయని తప్పు చేసిన్నట్లు స్టాంప్ పేపర్ మీద ఎందుకు వ్రాసి ఇవ్వాలని నవ్య ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే బెల్లంపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరిజన్ డైరీ ఎండీ శైలజను లైంగికంగా వేధిస్తున్నారంటూ జాతీయ మహిళా కమీషన్లో ఫిర్యాదు నమోదైంది. తాజాగా అధికార పార్టీకే చెందిన మరో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై కూడా ఫిర్యాదు నమోదవడంతో కేసీఆర్ ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోంది. మరి ఇప్పటికైనా మహిళలను వేదిస్తున్న ఎమ్మెల్యేలపై కేసీఆర్ చర్యలు తీసుకొంటారో లేదో?