ఏపీ కంటే ముందుగా తెలంగాణ శాసనసభ ఎన్నికలే జరుగనున్నాయి. అయితే ఏపీలో 4 ఏళ్ల క్రితం అంటే జగన్మోహన్ రెడ్డి సిఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడే ఎన్నికల హడావుడి మొదలైపోయింది. అవును నిజం!
ఆరోజు నుంచే ఏపీలో వైసీపీ ఓటు బ్యాంక్ పెంచుకొనేందుకు లక్షల కోట్లు అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పధకాల పేరుతో జగన్ ప్రభుత్వం పంచిపెడుతూనే ఉంది. తెలంగాణలో వారానికో అభివృద్ధి కార్యక్రమం లేదా పరిశ్రమలు, పెట్టుబడుల గురించి వార్తలు వస్తుంటే, ఏపీలో మాత్రం వారానికో సంక్షేమ పధకం గురించి ప్రభుత్వ ప్రకటనలు వస్తుంటాయి.
ఇక ఏపీలో రాజకీయ పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. ప్రతిపక్షాలపై కేసులు, వేధింపులు, దాడులు, ప్రతిపక్ష కార్యాలయాలను, వాహనాలను తగులబెట్టడం, హత్యలు, అత్యాచారాలు, కిడ్నాపులు, గంజాయి రవాణా, రకరకాల మాఫియాలతో ఆనాటి బిహార్ రాష్ట్రాన్ని తలపిస్తోందని నారా లోకేష్ అన్నారు.
ఇటీవలే అధికార వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, వారి ఆడిటర్‌ని కొందరు దుండగులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన గత కొంతకాలంగా హైదరాబాద్ వచ్చి అక్కడే వ్యాపారాలు చేసుకొంటున్నారంటే పరిస్థితులు అర్దం చేసుకోవచ్చు.
తాజాగా పదో తరగతి చదువుతున్నఓ విద్యార్ధిని వైసీపీ నేతలు బందించి పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. ఎందుకంటే తన చెల్లెలిని ఎందుకు వేధిస్తున్నారని అతను అడిగినందుకు!
ఇక పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ల రోడ్ షోలు, సభలు మొదలవగానే, వైసీపీ తరపున రాంగోపాల్ వర్మ, పోసాని కృష్ణ మురళి, ముద్రగడ పద్మనాభం వంటివారు అనేకమంది వెంటనే రంగంలో దిగిపోయి ఏదేదో మాట్లాడేస్తూ అగ్గి రాజేస్తుంటారు. ఇక మంత్రుల బూతులు, గొప్పలు సరేసరి.
ఏపీ, తెలంగాణలో భూముల ధరల గురించి సంగారెడ్డి సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ, “కేసీఆర్‌గారు ఓసారి విశాఖలోని అచ్యుతాపురానికి వస్తే ఇక్కడ భూముల ధరలు ఎంతున్నాయో చూపిస్తాను. ఇక్కడ ఒక్క ఎకరం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చు. అయినా హైదరాబాద్ దాటితే తెలంగాణ మరెక్కడైనా భూముల ధరలు పెరిగాయా? ఏమైనా అభివృద్ధి జరిగిందా?” అని ఎద్దేవా చేశారు.
ఏపీ తెలంగాణ రాష్ట్రాలు ఒకేసారి వేరుపడ్డాయి కానీ ఈ 9 ఏళ్లలో తెలంగాణ అన్ని రంగాలలో దూసుకుపోతుంటే, ఏపీ ఈ స్థితికి చేరుకొంది. అయినా ఇలాంటి ప్రగల్భాలు మానుకోలేదు.