
నిన్న హైదరాబాద్లో తెలంగాణ అమరవీరుల స్మారకమందిరాన్ని, జ్యోతిని సిఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను కూడా ఆహ్వానించారు. ఆమెకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సిఎం కేసీఆర్ నిర్ణయించిన్నట్లు ఊహాగానాలు వినిపిస్తుండటంతో నిన్న జరిగిన ఈ కార్యక్రమంలో సిఎం కేసీఆర్ ఈవిషయం ప్రకటిస్తారని ఆమెతో సహా అందరూ ఎదురుచూశారు. కానీ కేసీఆర్ ఆమెకు శాలువా కప్పి నమస్కారం పెట్టారు. అంతే.
తర్వాత ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “నా కొడుకు తన కోసమో, నా కోసమో, మా కుటుంబం కోసమో ప్రాణత్యాగం చేయలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశాడు. కనుక అతనికి తెలంగాణ ప్రభుత్వం, నాయకులు, ప్రజలూ అందరి మనసులలో నా కొడుకు ఎప్పటికీ చిరంజీవిగా ఉంటాడు. ఉండాలని కోరుకొంటున్నాను. అయితే ఈరోజు జరిగిన కార్యక్రమంలో వేదికపై నా కొడుకు ఫోటో పెట్టలేదు. అందుకు నాకు చాలా బాధ కలిగింది.
నా కొడుకు త్యాగానికి ఎంత చేసినా తక్కువే. కనుక తనకు తగిన గుర్తింపు కల్పించాలని నేను సిఎం కేసీఆర్ను కోరుకొంటున్నాను. ఆ కడుపుకోత అనుభవిస్తున్న నాకు సిఎం కేసీఆర్ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నాకు టికెట్ ఇచ్చారు కానీ నేను గెలవలేకపోయాను. అప్పటి నుంచి నేను ఖాళీగానే ఉన్నాను. పార్టీని నమ్ముకొనే ఉన్నాను.
ఓసారి మంత్రి కేటీఆర్ని కలిసి అడిగితే తప్పకుండా ఏదో ఓ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తారని పేపర్లలో వస్తే చూశాను తప్ప నాకెవరూ చెప్పలేదు. ఈరోజు జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ ఆ మాట చెప్తారని ఎదురుచూశా కానీ ఆయన ఏమనలేదు. బహుశః ఇది సందర్భం కాదనుకొన్నారేమో?
నా కొడుకుతో పాటు మరో 1400 మంది వరకు బలిదానాలు చేసుకొన్నారు. వారిలో ఓ 4-500 మంది కుటుంబాలకు ప్రభుత్వం ఉద్యోగాలు, ఆర్ధికసాయం అందించింది. మిగిలినవారికి కూడా ఇస్తే బాగుంటుంది,” అని అన్నారు.