పటాన్‌చెరు వరకు మెట్రో రైలు పొడిగిస్తాం: కేసీఆర్‌

ఈరోజు పటాన్‌చెరు వద్ద రూ.183 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు సిఎం కేసీఆర్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ పటాన్‌చెరు వరకు మెట్రో రైలు పొడిగిస్తామని మరో సంచలన ప్రకటన కూడా చేశారు.

అయితే మళ్ళీ వచ్చే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాగానే మొట్టమొదట ఈ పనినే ప్రారంభించుకొందామని కేసీఆర్‌ అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్‌ కొరత లేదు కనుక పటాన్‌చెరులో పరిశ్రమలు రోజుకి మూడు షిఫ్టులలో పనిచేస్తున్నాయని, ఇంకా అనేక కొత్తకొత్త పరిశ్రమలు వస్తున్నాయని అన్నారు.

ఈ కారణంగా పటాన్‌చెరు శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, చుట్టుపక్కల కాలనీలు చాలా పెరిగాయని అన్నారు. ఇక్కడకు వచ్చిపోయేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది కనుక దిల్‌సుఖ్‌నగర్‌-పటాన్‌చెరుని కలుపుతూ మెట్రో రైలు పొడిగించాల్సిన అవసరం ఉందని నేను కూడా భావిస్తున్నానని కేసీఆర్‌ అన్నారు.

అయితే ఇప్పటికిప్పుడు ప్రారంభించడం సాధ్యం కాదు కనుక వచ్చే ఎన్నికల తర్వాత ప్రారంభించుకొందామని కేసీఆర్‌ అన్నారు. పటాన్‌చెరులో ఇప్పటికే ఎకరా మూడు కోట్లు పలుకుతోందని కేసీఆర్‌ అన్నారు. ఇప్పుడు ఈ మెట్రో రైల్ ప్రకటనతో అక్కడ భూముల ధరలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది.