పోడు రైతులకు పట్టాలు, రైతుబంధు

తెలంగాణ ప్రతిష్ఠాత్మకమైన అమలుచేస్తున్న రైతుబంధు పధకంలో ఈ నెల 26 నుంచి వానాకాలం పంట సాయంగా రాష్ట్రంలో రైతుల బ్యాంక్ ఖాతాలలో సొమ్ము జమా చేయబోతున్న సంగతి తెల్సిందే. వారితో పాటు కొత్తగా వ్యవసాయభూములను కొనుగోలుచేసినవారు కూడా అదే రోజు నుంచి తమ పేర్లను ఈ పధకం కోసం దరఖాస్తు చేసుకొనేందుకు ప్రభుత్వం అనుమతించింది.

ఈనెల 16వ తేదీ లేదా అంతకంటే ముందు భూములు కొనుగోలుచేసినవారు, ఇదివరకే వ్యవసాయ భూములు కలిగి ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకోనివారు కూడా స్థానిక వ్యవసాయాధికారులకు దరఖాస్తులు సమర్పించాలని వ్యవసాయశాఖ తెలియజేసింది. 

ఈ నెల 24 నుంచి రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు 4 లక్షల ఎకరాలు పోడుభూములు పంచిపెట్టనుంది. వారు కూడా రైతుబంధు పధకానికి అర్హులే అని వ్యవసాయశాఖ తెలిపింది. 

ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షలమంది రైతుబంధు పధకంలో ఉండగా కొత్తగా మరో రెండున్నర లక్షమంది ఈ పధకంలో చేరవచ్చని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది.