వందో వెయ్యో కాదు... 15,660 డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ళకు నేడు ప్రారంభోత్సవం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన చేపట్టిన పధకాలలో రాష్ట్రంలో ఇళ్ళులేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ళ పధకం కూడా ఒకటి. దానిలో భాగంగా సంగారెడ్డి జిల్లా కోల్లూరులో 145 ఎకరాలలో రాష్ట్ర ప్రభుత్వం 15,660 ఇళ్ళు నిర్మించింది. ఒకే చోట అన్ని ఇళ్ళు నిర్మించడంతో అదో పెద్ద టౌన్‌షిప్‌లా కనిపిస్తోంది. వీటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,432.50 కోట్లు ఖర్చు చేసింది. 

వీటిలో సుమారు లక్ష మంది నివసించేందుకు వీలుగా సకల సదుపాయాలతో నిర్మించింది. రియల్ ఎస్టేట్ సంస్థలు నిర్మిస్తున్న ప్రైవేట్ వెంచర్స్‌కు ఏమాత్రం తీసిపోనివిదంగా ఈ టౌన్‌షిప్‌ని నిర్మించడంతో లబ్ధిదారులు దానిలో తమ ఇళ్లను చూసుకొని మురిసిపోతున్నారు. లబ్ధిదారులు గృహావేశాలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకొని, బంధుమిత్రులను ఆహ్వానిస్తున్నారు. సిఎం కేసీఆర్‌ ఈరోజు వాటికి ప్రారంభోత్సవం చేయనున్నారు. దీంతో వారం రోజుల నుంచి ఈ టౌన్‌షిప్‌లో పండుగ వాతావరణం నెలకొంది.   

గృహాలక్ష్మి పధకం: రాష్ట్రంలో ఇళ్ళ స్థలాలు కలిగి ఉండి, ఆర్ధిక స్థోమతలేక ఇళ్ళు నిర్మించుకోలేకపోతున్నవారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పధకం ప్రకటించింది. దీని కోసం ఒక్కో లబ్దిదారుడికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు చెల్లిస్తుంది. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.12 వేలకోట్లు దీని కోసం కేటాయించింది. ప్రతీ నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఇళ్ళ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇళ్ళు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకొంది. 

ఈ గృహాలక్ష్మి పధకానికి సంబందించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇంటి స్థలం కలిగిన పేదలు జిల్లా కలక్టర్లు లేదా తమ ప్రజాప్రతినిధులను సంప్రదించి వారి ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వారి అర్హతను బట్టి ఎంపిక చేసి ఈ పధకం మంజూరు చేస్తారు. 

ఒకసారి ఈ పధకానికి ఎంపికైతే ఇంటి నిర్మాణ పురోగతిని బట్టి దశలవారీగా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలోకే ఆ సొమ్మును జమా చేస్తుంది ప్రభుత్వం. నూరుశాతం రాయితీతో ఈ పధకం అమలుచేస్తున్నందున లబ్ధిదారులు ఈ సొమ్మును తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు.