
నేటితో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా తెలంగాణ సచివాలయం సమీపంలో నిర్మించిన అమరవీరుల స్మారక జ్యోతిన్ని, స్మారక భవనాన్ని సిఎం కేసీఆర్ నేడు ప్రారంభోత్సవం చేయనున్నారు. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించింది.
ఈరోజు సాయంత్రం 5 గంటలకు డా.అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి 6,000 మంది కళాకారులతో ప్రదర్శనలు నిర్వహిస్తూ అమరవీరుల స్మారక జ్యోతి వద్దకు చేరుకొంటారు. అదే సమయానికి సిఎం కేసీఆర్ కూడా అక్కడకు చేరుకొంటారు. తెలంగాణ పోలీసులు అమరవీరులకు గన్ సెల్యూట్ చేసిన తర్వాత సిఎం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత అమరజ్యోతిని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ జరిగే సభలో సిఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా 800 డ్రోన్లతో లేజర్ షో నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీస్ విభాగం తెలియజేసింది. నేడు లుంబినీ పార్క్, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్‌లను మూసివేస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.