శంకరమ్మకు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి?

తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారిని రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తున్నప్పటికీ అతని తల్లి శంకరమ్మకు పూర్తి న్యాయం చేయలేదనే వాదన ఇంకా వినిపిస్తూనే ఉంది. కనుక ఆమెకు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. గవర్నర్‌ కోటాలో ఆమె పేరును ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తే గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తిరస్కరించరని కేసీఆర్‌ భావిస్తున్నారు.

ఆమె అమరవీరుడి తల్లి కనుక గవర్నర్‌ ఆమెను ఎమ్మెల్సీగా ఆమోదిస్తే ఆ గౌరవం కేసీఆర్‌కు దక్కుతుంది. ఒకవేళ గవర్నర్‌ తిరస్కరిస్తే, బిఆర్ఎస్ నేతలకు ఆమెను విమర్శించేందుకు మరోసారి అవకాశం లభిస్తుంది. త్వరలోనే శంకరమ్మ పేరును ఎమ్మెల్సీగా సిఫార్సు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌కు లేఖ పంపించనుందని సమాచారం. 

శ్రీకాంతాచారి చేసిన త్యాగాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్‌ ఆమెకు హుజూర్‌నగర్‌ నుంచి శాసనసభకు పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. కానీ ఆ ఎన్నికలలో శంకరమ్మ ఓడిపోయారు. మళ్ళీ గత ఎన్నికలలో అదే స్థానానికి ఆమె పోటీ పడ్డారు. కానీ ఈసారి సైదిరెడ్డికి అవకాశం ఇచ్చి ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అందుకే ఇప్పుడు ఆమెను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది.