కరీంనగర్‌లో మానేరు నదిపై తెలంగాణ ప్రభుత్వం రూ.224 కోట్లు వ్యయంతో నిర్మించిన కేబిల్ బ్రిడ్జిని బుదవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ వంతెన పొడవు 500 మీటర్లు, 21.5 మీటర్ల వెడల్పు. దీనిపై రెండువైపులా వాహనాలు ప్రయాణించేందుకు, వాటి పక్కనే పాదచారులు వెళ్ళేందుకు 1.5 మీటర్ల వెడల్పుతో రెండు ఫుట్ పాత్‌లు కూడా నిర్మించారు.
కరీంనగర్ కమాన్ నుంచి ఈ వంతెన వరకు 3.4 కిమీ, వంతెన నుంచి సదాశివపల్లి వైపు 500 మీటర్ల మేర రోడ్లను కూడా నిర్మించారు. ఈ కేబిల్ బ్రిడ్జిపై అత్యాధునిక కొరియన్ సాంకేతిక పరిజ్ఞానంతో డైనమిక్ లైటింగ్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. మద్యలో నాలుగు ఎల్ఎన్ఎస్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ వంతెనకు అవసరమైన 500 మీటర్ల స్టీల్ కేబుల్స్ ఇటలీ నుంచి తెప్పించారు.
ఈ వంతెనపై నుంచి ప్రయాణిస్తుంటే ఒకవైపు మిడ్ మానేరు రిజర్వాయర్, మరోవైపు రూ.410 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ కనిపిస్తుంది. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో జగిత్యాల, పెద్దపల్లి, అదిలాబాద్, సిరిసిల్లా తదితర ప్రాంతాల నుంచి కరీంనగర్‌కు రాకపోకలు చేసేందుకు చాలా సౌకర్యంగా ఉంటుంది. దీంతో వరంగల్, విజయవాడకు సుమారు ఏడు కిమీ దూరం, ఆమేరకు ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది.
హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం పూట వాహనాలు నిషేదించి ప్రజలు విహరించేందుకు అవకాశం కల్పించినట్లే దీనిపై కూడా ఆదివారం సాయంత్రం వాహనాల రాకపోకలను నిషేదిస్తారు. తెలంగాణలో హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబిల్ బ్రిడ్జ్ తర్వాత ఆ స్థాయిలో నిర్మించిన రెండవ కేబిల్ బ్రిడ్జ్ ఇదే.