స్టేషన్‌ఘన్‌పూర్
బిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వేధింపుల కారణంగా తన పరిస్థితి దయనీయంగా మారిందని
జానకీపురం సర్పంచ్ నవ్య ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్
ఆదేశం మేరకు రాజయ్య తనకు 25
లక్షలు ఇచ్చారని, దాంతో తాను హైదరాబాద్‌లో ఫ్లాట్
కొనుకొన్నానంటూ గ్రామంలో కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన
వ్యక్తం చేశారు. అయితే రాజయ్య తనకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు.
ఆ సొమ్ము
కావాలంటే,
వేరేవారి ప్రోద్బలంతోనే రాజయ్య తనను లైంగికంగా వేదిస్తున్నాడని తప్పుడు ఆరోపణలు చేశానని
అంగీకరిస్తూ బాండ్ పేపర్ మీద వ్రాసి సంతకం చేసి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని నవ్య
పేర్కొన్నారు. రాజయ్య పీఏ మరో ముగ్గురు కలిసి తన భర్త ప్రవీణ్‌కు బ్రెయిన్ వాష్ చేసి, ఆయన చేత కూడా తనపై ఒత్తిడి చేయిస్తున్నారని నవ్య ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే
గ్రామాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల కోసం తాను బాండ్ పేపర్ ఎందుకు
వ్రాసివ్వాలని నవ్య ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్‌ల ప్రేరణతో ఎంబీఏ చదివి ఉద్యోగం చేసుకొంటున్న తాను ఉద్యోగం వదులుకొని
రాజకీయాలలోకి వచ్చానని అన్నారు. కానీ రాజకీయాలలోకి వచ్చాక తన భూమి, బంగారం అన్నీ పోయాయని, ఇప్పుడు తన భర్త కూడా దూరమయ్యాడని
నవ్య ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడు
తనకి ఈ చిన్న ఇల్లు ఒకటే మిగిలిందని, తన పిల్లలను పోషించుకోవడానికి మెడలో పుస్తెలు కూడా ఇటీవలే అమ్మేశానని నవ్య
కన్నీళ్ళు పెట్టుకొన్నారు. రాజయ్య వద్ద డబ్బు తీసుకొని ఉండి ఉంటే నేడు తాను ఈ పరిస్థితిలో
ఎందుకు ఉంటాను? అని ప్రశ్నించారు.
సిఎం
కేసీఆర్,
కేటీఆర్ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నారని, కానీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వారి పరువు, ప్రభుత్వం
పరువు తీస్తున్నారని నవ్య ఆరోపించారు.
తన భర్త తనకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయినా, ఆర్ధిక సమస్యలు చుట్టుముడుతున్నా తాను రాజయ్యకు లోంగే ప్రసక్తే లేదని సర్పంచ్ నవ్య అన్నారు. ఒక వివాహిత మహిళను అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇంతగా వేదిస్తుంటే, మరి పోలీసులు, దిశ చట్టం, ప్రభుత్వం, రాష్ట్ర మహిళా కమీషన్, మహిళా సంఘాలు, బిఆర్ఎస్ నేతలు, ముఖ్యమంత్రి, మంత్రులు ఏమి చేస్తున్నారో?
(Video courtecy: Eenadu Media)