బిఆర్ఎస్ నుంచి బహిష్కరింపబడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. వారిరువురూ ఈ నెల 22న ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహించి రాహుల్ గాంధీ లేదా ప్రియాంకా గాంధీల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని మొదట వార్తలు వచ్చినప్పటికీ, ఈ నెల 25న ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీతో భేటీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన చేస్తారని తెలుస్తోంది. జూలై 2న ఖమ్మంలో బహిరంగసభ నిర్వహించి, రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ కండువాలు వేసుకొంటారని సమాచారం. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం వారివురినీ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించనున్నారు.
ఇక జూలై 2 లేదా 3 తేదీలలో వైఎస్ షర్మిల తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని రాహుల్ గాంధీ సమక్షంలో విలీనం చేయబోతునట్లు తెలుస్తోంది. ఆమెకు ఆంధ్రా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించేందుకు ఒప్పందం జరిగిన్నట్లు సమాచారం. అదే కనుక జరిగితే, ఆమె తెలంగాణకు గుడ్ బై చెప్పి ఆంధ్రాలో తన జగనన్నతో యుద్ధం చేసేందుకు సిద్దపడుతున్నట్లే.