నేడు హైదరాబాద్‌కు కేంద్ర ఎన్నికల కమీషన్‌

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియను ఈ ఏడాది డిసెంబర్‌లోగా ముగించవలసి ఉంటుంది కనుక సెప్టెంబర్‌ లేదా అక్టోబర్ నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. అంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉందన్న మాట. అందుకే ఎన్నికల ఏర్పాట్ల గురించి రాష్ట్ర ఎన్నికల సంఘంతో చర్చించేందుకు నేడు కేంద్ర ఎన్నికల కమీషన్‌ బృందం హైదరాబాద్‌ రానున్నది. హైదరాబాద్‌లో నాలుగు రోజులు ఉండి జిల్లాల ఎస్పీలు, కలక్టర్లలతో సమావేశమయ్యి ఎన్నికల ఏర్పాట్ల గురించి చర్చించనున్నారు. 

ఎన్నికలు సమీపిస్తుండటంతో సిఎం కేసీఆర్‌ ఇప్పటికే జిల్లాల పర్యటనలు మొదలుపెట్టి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు విడుదల చేస్తున్నారు. జిల్లాలకు, వివిద వర్గాల ప్రజలకు, ప్రభుత్వోద్యోగులకు, కార్మికులకు వరాలు ప్రకటిస్తున్నారు. చేతి వృత్తులు చేసుకొనేవారికి లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సాయం అందించే ప్రక్రియ మొదలుపెట్టారు. 

ఇక బిజెపి కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా త్వరలో అమిత్‌ షా, ప్రధాని నరేంద్రమోడీలతో రాష్ట్రంలో బహిరంగసభలు నిర్వహించబోతోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి నేతలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకొనేందుకు సిద్దం అవుతోంది. కనుక అన్ని పార్టీలు కూడా శాసనసభ ఎన్నికలకు సిద్దంగానే ఉన్నట్లు భావించవచ్చు.