ప్రజాగాయకుడు గద్దర్ చాలా కాలంగా రాజకీయపార్టీల మద్య తిరుగుతున్నారు. ఆయన మునుగోడు ఉపఎన్నికలలో కేఏ పాల్ నేతృత్వంలో నడుస్తున్న ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేసేందుకు సిద్దపడ్డారు కానీ చివరి నిమిషంలో ఆ ఆలోచన విరమించుకొన్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీతో భేటీ అవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అందరూ భావించారు. కానీ ఆయనే స్వయంగా కొత్త పార్టీని స్థాపించబోతున్నారు.
ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఎన్నికల కమీషన్లో ‘గద్దర్ ప్రజాపార్టీ’ పేరును రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. ఎరుపు, నీలం, ఆకుపచ్చ మూడు రంగులతో మద్యలో బిగించిన పిడికిలి బొమ్మతో పార్టీ జెండాను రూపొందించిన్నట్లు సమాచారం. ఏదో ఓ పార్టీలో చేరి తన ఆలోచనలు, ఆశయాలను వదులుకోవడం కంటే, తన ఆశయాలకు తగ్గట్లు పనిచేయడం కోసం సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవడమే మంచిదని గద్దర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గద్దర్ ఆట, పాటను తెలంగాణ ప్రజలందరూ అభిమానిస్తుంటారు. అయితే బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీల ప్రభావంలో ఉన్న రాష్ట్ర ప్రజలు తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరామ్‌నే పట్టించుకోవడం లేదు. ఇక గద్దర్ పార్టీని ఆదరిస్తారా? అంటే లేదనే భావించవచ్చు.
దశాబ్ధాల పాటు రాజకీయాలలో నలిగిన గద్దర్‌కు ఈ విషయం తెలియదనుకోలేము. పైగా ఇప్పుడు సాధారణ వ్యక్తులు ఎవరూ ఎన్నికల ఖర్చును భరించలేని స్థితి నెలకొంది. వందల కోట్లు వెదజల్లగలవారే ఎన్నికలలో పోటీ చేసేందుకు అర్హులుగా పరిగణింపబడుతున్నారు. కనుక గద్దర్ చేతులు కాల్చుకోబోతున్నట్లే భావించవచ్చు. అయితే ఆయనకు ఇంకా సమాజం మీద ఉన్న అపారమైన నమ్మకమే ఈ సాహసానికి పూనుకొనేలా చేస్తోందని చెప్పుకోవచ్చు.