13.jpg)
తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు ఓ శుభవార్త! వారికి 2.73% డీఏ పెంచాలని సిఎం కేసీఆర్ ఆదేశించారని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా సిఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొన్నారని తెలిపారు. పెంచిన డీయేను జూలై 1న అందుకోబోయే జూన్ నెల జీతంలో కలిసి చెల్లిస్తామని తెలిపారు. దీని వలన రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా నెలకు రూ.81.18 కోట్లు భారం పడుతుందని, రూ.1380 కోట్ల ఎరియర్స్ చెల్లించాల్సి ఉంటుందని, కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులందరూ కీలకపాత్ర పోషిస్తున్నందున వారికి ఈ చిన్న బహుమతి ఇస్తున్నామని చెప్పారు.
మేడే సందర్భంగా రాష్ట్రంలో పారిశుధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 చొప్పున జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. మే, జూన్ నెలలో కలిపి పెరిగిన రూ.2,000 కూడా జూలై 1న జీతాలతో కలిపి చెల్లిస్తామని చెప్పారు. ఈ పెంపుతో రాష్ట్రంలో 1,64,474 మంది పారిశుధ్య కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంపుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి హరీష్ రావు ఆర్ధికశాఖ అధికారులను ఆదేశించారు. జూనియర్ పంచాయితీ కార్యదర్శులను క్రమబద్దీకరణకు విధివిధానాలు ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి హరీష్ రావు తెలిపారు.