
తెలంగాణ రైతులకు ఓ శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ఏటా రైతుబంధు పధకం కింద పంట సాయంగా అందిస్తున్న సొమ్మును ఈ వర్షాకాలం సీజన్ కోసం ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాలలో జమా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సిఎం కేసీఆర్ సచివాలయంలో రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్రావు, ఆ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులతో సమావేశమయ్యి రైతుబంధు సొమ్ము విడుదల చేయడం గురించి చర్చించి 26 నుంచి రైతుల ఖాతాలలో జమా చేయాలని నిర్ణయించారు.
ఎప్పటిలాగే ఈసారి కూడా ముందుగా ఎకరంలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు రైతుబంధు సొమ్ము ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఆ తర్వాత 2-5 ఎకరాలలోపు రైతులకు, చివరిగా 5 ఎకరాలు పైబడి ఉన్న రైతులకు సొమ్ము విడుదల చేస్తుంది. వర్షాకాలం మొదలయ్యే ముందే రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు నిధులు విడుదల చేయబోతుండటంతో రాష్ట్రంలో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రైతులు పంటలు వేసే ముందు విత్తనాలు, ఎరువులు వగైరా కొనుగోలు చేసేందుకు డబ్బు సమకోర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన తెలంగాణ సిఎం కేసీఆర్ ఈ రైతుబంధు పధకం ప్రవేశపెట్టారు. తొలిసారిగా 2018, మే 10న కరీంనగర్ జిల్లాలో దీనిని స్వయంగా ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు నిరంతరాయంగా ఏటా రెండుసార్లు ఎకరానికి రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.10,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాలలో జమా చేస్తోంది.