ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సంచలన విషయాలు బయటపెట్టారు. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో నిన్న పార్టీ నేతలతో మాట్లాడుతూ, “నేను రాజకీయాలలో రాకముందే నాకు ఒక రాజకీయ పార్టీ నుంచి బెదిరింపులు వచ్చాయి. రాజకీయాలలోకి వస్తే మీ ఇంట్లో ఆడవాళ్ళను కిడ్నాప్ చేస్తామని, నన్ను లేపేస్తామని బెదిరించారు. నన్ను ఎవరైనా బెదిరించినా, ముఖ్యంగా ఆడవాళ్ళ జోలికి వస్తే నేను అసలు సహించను. మరింత మొండిగా వారిని ఎదుర్కొంటాను. అందుకే జనసేన పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చాను. ఇప్పుడు కూడా నన్ను హత్య చేసేందుకు ఓ సుపారి గ్యాంగ్‌ను రంగంలో దించిన్నట్లు నాకు సమాచారం ఉంది. అందువల్ల నాకు ప్రాణహాని ఉంది,” అని చెప్పారు. కాకినాడ అర్బన్ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన గూండాలతో జనసేన కార్యకర్తలను, మహిళలను బెదిరిస్తున్నారని కనుక అందరూ జాగ్రత్తగా ఉండాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో రాజకీయాలు పరస్పర ఆరోపణలకే పరిమితంగా ఉంటే, ఏపీలో మాత్రం ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై భౌతికదాడులు, హత్యలు చేసేవరకు వచ్చేశాయి. 2019లో ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో వైఎస్ వివేకానందరెడ్డిని కడపలో ఆయన నివాసంలోనే కొందరు దుండగులు గొడ్డలితో అతిదారుణంగా నరికి హత్య చేయగా, ఆ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డితో సహా పలువురుపై తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్‌లో సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. కనుక పవన్ కళ్యాణ్ తనకు ప్రాణహాని ఉందని చెప్పడాన్ని తేలికగా తీసుకోలేము. అయితే ఆయన రక్షణకు కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఏర్పాట్లు చేస్తుందో లేదో?
పవన్ కళ్యాణ్ నిన్న కాకినాడలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమలో ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్ అందరం కలిసిమెలిసి పనిచేస్తుంటామని, అందరూ కలిస్తేనే టాలీవుడ్ అవుతుందన్నారు. కనుక హీరోలందరి అభిమానులు కూడా వచ్చే ఎన్నికలలో జనసేనకు ఓట్లు వేసి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.