
తెలంగాణ పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌పై ఉపా చట్టం కింద పోలీసులు దేశద్రోహం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దానిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ కేసులో ఆయనతో సహా 125 మంది ఉద్యమకారులు, మేధావులపై గత ఏడాది ఆగస్ట్ 19న ములుగు జిల్లాలోని తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. ఇవి కాక అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం వంటి మరికొన్ని కేసులను కూడా పోలీసులు నమోదు చేశారు. వాటన్నిటినీ ఎత్తివేయాలని సిఎం కేసీఆర్ డిజిపి అంజని కుమార్‌ని ఆదేశించిన్నట్లు తెలుస్తోంది. కనుక త్వరలోనే దీనిపై హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది.
ప్రొఫెసర్ హరగోపాల్‌తో సహా ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నవారందరూ మావోయిస్టులకు సహాయసహకారాలు అందిస్తున్నారని, వారిలో కొందరు బీరెల్లి కుట్రలో పాల్గొన్నారని, నిషేదిత మావోయిస్ట్ సాహిత్యంలో ప్రొఫెసర్ హరగోపాల్ ప్రస్తావన జరిగిందని పోలీసులు ఆరోపించారు.
మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు నేతృత్వంలో జరిగిన దాడులలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రభుత్వాన్ని కూలద్రోసి అధికారం చేజిక్కించుకోవాలని కుట్ర చేయడం, మారుమూల గ్రామాలలో అమాయక యువకులను రెచ్చగొట్టి మావోయిస్టులలో చేర్చుకోవడం వంటి అనేక నేరపూరితమైన పనులలో ప్రొఫెసర్ హరగోపాల్, తదితరుల ప్రమేయం ఉందని పోలీసులు ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు.
అయితే ఇంతకాలం పోలీసులు ఈవిషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు. ఇటీవల పిడిఎం అధ్యక్షుడు చంద్రమౌళి బెయిల్ కోసం రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ వేసినప్పుడు, న్యాయమూర్తి ఆదేశం మేరకు పోలీసులు ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులపై కేసు నమోదు చేసిన విషయం బయటపడింది. అటువంటి వ్యక్తులపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేయడం పట్ల ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా విమర్శించడంతో సిఎం కేసీఆర్ ఆ కేసులన్నిటినీ ఎత్తివేయాలని ఆదేశించారు.