బిఆర్ఎస్ నుంచి బహిష్కరించబడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇద్దరూ దాదాపు 4-5 నెలలుగా ఆత్మీయ సమ్మేళనాలు అంటూ హడావుడి చేస్తున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వారిని బిజెపిలోకి తీసుకువెళ్ళేందుకు గట్టిగానే ప్రయత్నించారు కానీ వారిరువురూ తనకే పాఠాలు చెప్పారని అన్నారు.
చివరికి వారిరువురూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకొని ముహూర్తం కూడా పెట్టేసుకొన్నారు. ఈ నెల 30న ఖమ్మంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి దానికి రాహుల్ గాంధీ లేదా ప్రియాంకా గాంధీలను ఆహ్వానించి వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకొన్నారు. ఇదే విషయం చర్చించేందుకు వారిని రాహుల్ గాంధీ ఢిల్లీకి ఆహ్వానించారు. వారితోపాటు పిడమర్తి రవి, కూచుకూళ్ళ దామోదర్ రెడ్డి కూడా ఈనెల 22న ఢిల్లీకి వెళ్ళబోతున్నారు.
వారితో పాటు ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి పాయం వేంకటేశ్వర్లు, మేఘారెడ్డి , కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, కొండూరి సుధాకర్, బానోత్ విజయాబాయి, దొడ్డా నగేష్ యాదవ్, కోటా రాంబాబు, జారే ఆదినారాయణ, మద్దినేని బేబీ స్వర్ణ కుమారి తదితరులు, వేలాదిమంది వారి అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు.
దీంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలోపేతం అవుతుంది. ఈసారి ఈ రెండు ఉమ్మడి జిల్లాలలో ఒక్క సీటు కూడా బిఆర్ఎస్ పార్టీ గెలుచుకొనీయమని వారు శపధం చేస్తున్నారు. బలమైన నేతలందరూ మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుతున్నందున వారి నుంచి బిఆర్ఎస్‌కు గట్టిపోటీ తప్పదు.