వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కులో భారీ పెట్టుబడితో కొరియా కంపెనీ

తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ వరంగల్‌ నగరం సమీపంలో ఏర్పాటు చేస్తున్న ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ, దక్షిణ కొరియాకు చెందిన యంగ్ వన్ గ్రూప్ సంస్థకు ఆదివారం శంకుస్థాపన చేయబోతున్నానని తెలియజేశారు. ఆ సంస్థ రూ.900 కోట్ల పెట్టుబడితో అక్కడ 8 పరిశ్రమలను ఏర్పాటు చేయబోతోందని, వాటిలో 12,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించబోతున్నాయని మంత్రి కేటీఆర్‌ తెలియజేశారు. 

ఇప్పటికే టెక్స్‌టైల్‌ పార్కు నిర్మాణ పనులు చాలావరకు పూర్తయ్యాయని తెలిపారు. టెక్స్‌టైల్‌ పార్కులో గణేశా ఎకోటెక్ కంపెనీ ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిందని, కైటెక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించబోతోందని మంత్రి కేటీఆర్‌ తెలియజేశారు. 

తెలంగాణలో లక్షలాదిమంది చేనేత కార్మికులున్నారు. అలాగే మరమగ్గాలతో నడిచే చిన్నచిన్న కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే సమైక్య రాష్ట్రంలో పాలకులు ఈ రెండు రంగాలను పట్టించుకోకపోవడంతో అనేకమంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. వేలాదిమంది సూరత్, మహారాష్ట్రలకు వలసలు వెళ్ళిపోయారు. 

అయితే తెలంగాణ ఏర్పడి, కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రెండు రంగాలకు బలోపేతం చేస్తూనే గట్టి పునాదులు వేశారు. ముఖ్యంగా పరిశ్రమలు, చేనేత శాఖల మంత్రి కేటీఆర్‌ వ్యక్తిగతంగా ఎంతో చొరవ తీసుకొని చేనేత కార్మికులకు బతుకమ్మ చీరలతో ఏడాది పొడవునా ఉపాది, వాటితో నెలకు కనీసం రూ.10-15000 ఆదాయం ఏర్పాటు చేశారు. 

తెలంగాణలో టెక్స్‌టైల్‌ రంగం అభివృద్ధి చేసేందుకు మంచి అవకాశాలు, అందుకు అవసరమైన నిపుణులైన కార్మికులు ఉన్నందున, ఇంకా భారీ స్థాయిలో వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కుకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఆ ఒక్క పార్కు ద్వారానే వేలాదిమందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తున్నాయి. ఇదివరకు ఉద్యోగాలు, ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వలసలు పోయినవారితో పాటు ఇతర రాష్ట్రాలలో చేనేత, మరమగ్గాల కార్మికులు కూడా తెలంగాణకు వస్తున్నారు.