ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఒకేసారి ఏర్పడినప్పటికీ, ఏపీలో పాలకులకు దూరదృష్టి లేకపోవడం, అధికారంలో కొనసాగడమే ప్రధానమన్నట్లు వ్యవహరిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో వెనకబడిపోయింది. నానాటికీ సమస్యలు కొండల్లా పేరుకుపోతున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెండుతుండటం, ఎప్పటికప్పుడు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు సైతం జీతాలు పెంచి క్రమబద్దీకరణ చేస్తుండటంతో సహజంగానే రెండు రాష్ట్రాలను సరిపోల్చి చూస్తుంటారు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ జీవో జారీ చేయడంతో, ఏపీ విద్యాశాఖలో భోదనేతర అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను నిన్న విజయనగరంలో కలిసి తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని కోరారు. అయితే ఆయన చెప్పిన జవాబు విని వారు షాక్ అయ్యారు.
“తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో బోగస్. దానిని నమ్మకండి. మీకు ఇంకా అనుమానం ఉంటే హైదరాబాద్ వెళ్ళడానికి నేనే మీకు టికెట్ డబ్బులు ఇస్తాను. వెళ్ళి కనుక్కొని రండి. తెలంగాణ ప్రభుత్వం కేవలం 960 మందినే క్రమబద్దీకరించింది. మీరందరూ మా పార్టీని మళ్ళీ గెలిపిస్తే మేము మళ్ళీ అధికారంలోకి వచ్చాక 2026లో పది వేలమందిని క్రమబద్దీకరిస్తాము. అంతవరకు అందరూ బుద్ధిగా పనిచేసుకోండి,” అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.