కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించి ఖమ్మంలో బహిరంగసభలో పాల్గొనవలసి ఉండగా, బిపోర్ జాయ్ తుఫాను కారణంగా చివరి నిమిషంలో పర్యటనను రద్దు చేసుకొన్నారు. బిపోర్ జాయ్ పెనుతుఫాను ఆయన స్వరాష్ట్రం గుజరాత్‌తో సహా ఇరుగు పొరుగు రాష్ట్రాలను తాకనుంది. ఈ తుఫాను తీవ్రత చాలా ఎక్కువగా ఉండబోతోందని వాతావరణశాఖ ముందే హెచ్చరిస్తుండటంతో గుజరాత్లో సముద్ర తీర ప్రాంతాల నుంచి సుమారు 74 వేలాదిమందిని ఖాళీ చేయించింది అక్కడి ప్రభుత్వం.
బిపోర్ జాయ్ తుఫాను ప్రస్తుతం గుజరాత్ సముద్ర తీరానికి 280 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈరోజు సాయంత్రం తీరం దాటవచ్చని, ఆ సమయంలో గంటకు 200 కిమీ వేగంగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అరేబియా సముద్రంలో అత్యంత ఎక్కువ కాలం ఉన్న తఫానుగా ఇది నిలుస్తోంది. దీనిని జూన్ 6వ తేదీన వాతావరణ గుర్తించింది. అప్పటి నుంచి అరేబియా సముద్రంలోనే కదలాడుతూ నేడు గుజరాత్లో తీరం దాటనుంది.
ఈ తుఫాను కారణంగా గుజరాత్లో భారీగా ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ బృందాలను పంపించింది. ఈ తుఫాను ముప్పును, సహాయ చర్యలను పర్యవేక్షించవలసి ఉంటుంది కనుక అమిత్ షా తెలంగాణ పర్యటనను రద్దు చేసుకొన్నారు. మళ్ళీ త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.