అప్పుడు తెలంగాణను ఇప్పుడు ఏపీని దోచుకొంటున్నారు

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ బుదవారం నుంచి ఉభయగోదావరి జిల్లాలో తన వారాహి వాహనంలో పర్యటిస్తున్నారు. బుదవారం సాయంత్రం కాకినాడ జిల్లాలోని కత్తిపూడి వద్ద బహిరంగసభలో ప్రసంగిస్తూ, “ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆంద్రా పాలకులు దోచుకొన్నారని వారి చేత తిట్లు తిట్టించుకొన్నాము. అయినా ఇంకా బుద్ధి రాలేదా? ఇప్పుడు ఆంధ్రాని కూడా దోచుకొంటున్నారు. మీరు ఎప్పటికీ మారరా?

జగన్ ప్రభుత్వం ఒక్క ఇసుక మాఫియాతోనే ఏడాదికి పదివేల కోట్లు అక్రమంగా దోచుకోంటోంది. ఇంకా మద్యం మాఫియా, మైనింగ్ మాఫియాలతో వేలకోట్లు దోచుకొంటోంది. ఇదేనా మీరు చేసే పాలన?నా వద్ద మీ వైసీపీ మంత్రుల అవినీతి భాగోతాలకు సంబందించి ఫైల్స్ కుప్పలు కుప్పలున్నాయి. వాటన్నిటినీ చదివి చదివి అలిసిపోయాను. మీ అవినీతికి అంతే లేదా?అని ఆశ్చర్యం కలుగుతుంది. 

మీరు అవినీతి సొమ్ముతో ఎన్నికలలో ఖర్చు చేస్తుంటే, నేను సినిమాలు చేసి సంపాదించిన సొమ్ముతో నా పార్టీని నడిపించుకొంటున్నాను. చివరికి నా పిల్లల భవిష్యత్‌ కోసం పొదుపు చేసిన సొమ్మును కూడా తెచ్చి ఖర్చు చేస్తున్నాను. నేను నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నాను. నన్ను పాలించేవాడు నాకంటే నిజయతీగా ఉండాలని కోరుకొంటున్నాను. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే అవినీతికి పాల్పడుతుంటే నేను మౌనంగా చూస్తూ ఊరుకోలేను. అందుకే నేను ఈ వైసీపీ ప్రభుత్వంతో పోరాడుతున్నాను. 

నేను ఇక్కడే మంగళగిరిలోనే పార్టీ ప్రధాన కార్యాలయం కట్టుకొని ఇక్కడి నుంచే రాజకీయాలు చేస్తాను. గత ఎన్నికలలో నన్ను ఓడించాలని పట్టుదలతో వైసీపీ నేను పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలో ఒక్కో దానిలో రూ. 100 కోట్లు పైనే ఖర్చు పెట్టింది. కానీ ఈసారి నేను తప్పకుండా అసెంబ్లీలో అడుగుపెడతాను. ముఖ్యమంత్రి పదవి ఇస్తే సవినయంగా తీసుకొంటాను. ఈసారి జనసేనను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎవరు అడ్డుకొంటారో నేనూ చూస్తాను. నేను ఒంటరిగా వస్తానో, వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకొని కలిసి వస్తానో వైసీపీకి ఎందుకు?సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను కదా?” అంటూ జగన్ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు.