ఈరోజు ఉదయం నుంచి బిఆర్ఎస్ నేతల ఇళ్ళు, కార్యాలయాలపై ఐటి దాడులు జరుగుతున్నాయి. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి ఇళ్ళు, కార్యాలయాలపై ఐటి దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు నగరాలతో సహా రాష్ట్రంలో 12 ప్రాంతాలలో ఏకకాలంలో 70 బృందాలు సోదాలు చేస్తున్నాయి.
ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి: తీర్ధ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో రియల్ ఎస్టేట్, మైనింగ్, లిథియం బ్యాటరీల వ్యాపారాలు చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు దక్షిణాఫ్రికాలో మైనింగ్ బిజినెస్ కూడా చేస్తున్నారు. ఇవి కాక ఆయనకు పలు బిజినెస్‌లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి: ఈయన కూడా సొంతంగా అనేక వ్యాపారాలు చేస్తున్నారు. ఫైళ్ళ శేఖర్ రెడ్డితో కూడా కలిసి పలు వ్యాపారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి: హైదరాబాద్‌తో సహా రెండు తెలుగు రాష్ట్రాలలో జేసీ బ్రదర్స్ పేరుతో అనేక షాపింగ్ మాల్స్ ఉన్నాయి. హైదరాబాద్, కేపీహెచ్‌బీ వద్ద గల జేసీ బ్రదర్స్ షాపింగ్ మాల్‌తో సహా ఆయన ఇళ్ళు, కార్యాలయాలు, ఇతర ప్రాంతాలలో గల షాపింగ్ మాల్స్‌లో ఐటి అధికారులు నేడు సోదాలు నిర్వహిస్తున్నారు. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చే ముందు బిఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధులపై ఒకేసారి ఐటి దాడులు జరుగుతుండటం యాదృచ్చికమా లేక బిజెపిలో చేరకపోతే మిగిలినవారికీ ఇటువంటి కష్టాలు తప్పవని హెచ్చరించేందుకా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.