తెలంగాణ ఉద్యమాలలో కేసీఆర్‌తో భుజంభుజం కలిపి పనిచేసిన ఉద్యమకారుడు, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన కూచాడి శ్రీహరి రావు సోమవారం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు ఉదయం జిల్లా కేంద్రంలో అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన తర్వాత ఉద్యమకారులకు విలువ ఈయని పార్టీలో ఇంతకాలం అతి కష్టం మీద కొనసాగానని అన్నారు.
తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు పనులు చేసిపెట్టలేని అసమర్ధుడుగా మిగిలిపోయానని, కనీసం జిల్లా మంత్రిని కలిసేందుకు కూడా అనర్హుడిగా పరిగణింపబడుతున్నప్పుడు ఇంకా పార్టీలో కొనసాగడం ఎందుకని రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు పంపిన రాజీనామా లేఖలో, కేసీఆర్ నిరంకుశ విధానాలను, అవినీతిని, అక్రమంగా ఆస్తులు పోగేసుకోవడాన్ని కూడా ప్రస్తావించడం విశేషం. ఈ నెల 17న శ్రీహరి రావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు.
శ్రీహరిరావు 2007లో అప్పటి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమాలలో చాలా చురుకుగా పనిచేస్తుండటంతో కేసీఆర్‌కు కుడిభుజంగా మారారు. ఇద్దరూ కలిసి ఉద్యమాలలో కలిసి పనిచేశారు. అదే వారి మద్య బలమైన స్నేహబందం ఏర్పరిచింది. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఆయనలో ఉద్యమకారుడు అదృశ్యమై, పక్కా రాజకీయ నాయకుడు ప్రత్యక్షమయ్యాడు.
దాంతో పార్టీ మనుగడకు, అవసరాలకు ఉపయోగపడేవారిని పొరుగు పార్టీల నుంచి తెచ్చుకొని మంత్రి పదవులు ఇచ్చారు. ఉద్యమకారులు, టిఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్నవారు చాలా మందిని విస్మరించారు. వారిలో కూచాడి శ్రీహరిరావు కూడా ఒకరు.
ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతుండటం వలన కేసీఆర్‌కు, బిఆర్ఎస్ పార్టీకి పెద్ద ఇబ్బందేమీ ఉండదు కానీ కేసీఆర్‌తో అంత సన్నిహితంగా పనిచేసిన ఆయన వంటివారు కేసీఆర్, ఆయన కుటుంబం మీద ఇంత తీవ్రమైన ఆరోపణలు చేయడం ప్రజలపై ఎంతో కొంత ప్రభావం చూపవచ్చు.