తెలంగాణలో అమిత్‌ షా పర్యటన షెడ్యూల్

తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఢిల్లీ నుంచి బిజెపి పెద్దల రాష్ట్ర పర్యటనలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 15న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఆరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడే పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 1.10 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకొని స్వామివారిని దర్శించుకొంటారు. సాయంత్రం 5 గంటలకు ఖమ్మంలోని ఎస్ఆర్‌బీజీఎన్ఆర్ కాలేజీ ఆవరణలో బిజెపి అధ్వర్యంలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. బహిరంగసభలో ముగిసిన తర్వాత మళ్ళీ శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకొని అక్కడ మరోసారి రాష్ట్ర బిజెపి నేతలతో సమావేశమవుతారు. రాత్రి 9.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుప్రయాణం అవుతారు. 

వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని ఓడించి బిజెపి అధికారంలోకి రావాలని కలలు కంటోంది. అయితే బిఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలలో బలమైన అభ్యర్ధులను ఎదుర్కొని ఓడించగల అభ్యర్ధులు కొద్ది మందే ఉన్నారు. కనుక ఆ రెండు పార్టీల నేతలను బిజెపిలోకి ఆకర్షించేందుకు బిజెపి చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఎంత ప్రయత్నించినా ఎవరూ బిజెపిలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. పైగా కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిచి అధికారంలోకి రావడంతో తెలంగాణలో కాంగ్రెస్‌ నేతలు కూడా చాలా నమ్మకంగా, ఉత్సాహం ఉన్నారు. 

ఈ నేపద్యంలో బిజెపి నేతలనే కాంగ్రెస్ పార్టీలో చేరాలని వారు ఆహ్వానిస్తున్నారు. ఈ పరిస్థితులలో అమిత్‌ షా తెలంగాణలో బిజెపిని ఏవిదంగా బలోపేతం చేసుకొంటారు? బిఆర్ఎస్‌ని ఓడించేందుకు ఎటువంటి వ్యూహాలు అమలుచేస్తారో చూడాల్సిందే?