కొత్తగూడెం నుంచి పోటీ చేస్తా: శ్రీనివాసరావు

తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టేశారు. శనివారం కొత్తగూడెంలోని శ్రీనగర్ కాలనీలో ఆయన అధ్వర్యంలో నడుస్తున్న జనహితం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ అవకాశం ఇస్తే ఆయన ఆశీర్వాదంటో నేను వచ్చే శాసనసభ ఎన్నికలలో కొత్తగూడెం నుంచి పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నాను. నేను పుట్టి పెరిగిన ఈ కొత్తగూడెంకు, ఇక్కడి ప్రజలకు నావంతుగా ఏమైనా చేయాలనే ఆలోచనతోనే నేను జీఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ప్రజలకు ఉచిత విద్యా, వైద్య సేవలు అందిస్తున్నాను. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాను. 

కనుక సిఎం కేసీఆర్‌ నాకు టికెట్‌ ఇస్తే కొత్తగూడెం నుంచి పోటీ చేసి శాసనసభలో అడుగుపెడితే మరింత మెరుగైన సేవలు అందించగలుగుతాను. ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని అనుకొంటున్నాను కానీ వస్తే కేసీఆర్‌ ఆశీర్వాదంతో బిఆర్ఎస్ పార్టీ నుంచే పోటీ చేస్తాను తప్ప వేరే పార్టీలో చేరను. స్వతంత్ర అభ్యర్ధిగా కూడా పోటీ చేయను. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాలు. కనుకనే ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి ప్రజలకు మరింత సేవ చేయాలనుకొంటున్నాను,” అని అన్నారు. 

ప్రభుత్వోద్యోగులు రాజకీయాలు మాట్లాడకూడదు కానీ ప్రత్యక్ష రాజకీయాలలో చేరవచ్చు. అయితే ముందుగా తమ పదవికి రాజీనామా చేయడం సబబు. తెలంగాణ ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్‌, ఆరేళ్ళ సర్వీసు ఉండగానే తన పదవీ విరమణ తీసుకొని బిఎస్పీలో చేరారు. కనుక ఆయనను ఎవరూ వేలెత్తి చూపలేరు. కానీ శ్రీనివాసరావు ప్రభుత్వోద్యోగం చేస్తూ, ప్రభుత్వం నుంచి జీతం తీసుకొంటూ కొత్తగూడెంలో సమాజాసేవ పేరుతో రాజకీయ పునాది నిర్మించుకొంటున్నారు. ఇప్పుడు ఆయనే స్వయంగా బయటపెట్టుకొన్నారు. 

కనుక టికెట్‌ ఇవ్వాలో లేక ప్రభుత్వోద్యోగం చేస్తూ రాజకీయపునాది వేసుకొంటున్నందుకు ఉద్యోగాన్ని తొలగించాలో సిఎం కేసీఆరే నిర్ణయించాలి. అదేదో తొందరగా నిర్ణయిస్తే ఎవరూ వేలెత్తి చూపకుండా నివారించవచ్చు.