జూన్ 15న ఖమ్మంలో అమిత్‌ షా బహిరంగసభ

తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఢిల్లీ నుంచి బిజెపి పెద్దలు రాష్ట్రానికి రాకపోకలు మొదలయ్యాయి. ఈ నెల 15న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఖమ్మంలో బిజెపి అధ్వర్యంలో జరిగే బహిరంగసభలో పాల్గొనేందుకు వస్తున్నారు.

ఈరోజు ఉదయం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్‌, జిల్లా నేతలతో కలిసి బహిరంగసభ వేదిక కోసం ఖమ్మంలోని ఎస్పీ స్టేడియం, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ మైదానాలను పరిశీలించారు. వాటిలో రెండోది విశాలంగా ఉండటంతో అక్కడే బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల కోసమే ఈ బహిరంగసభలో నిర్వహిస్తున్నందున, కనీసం లక్షమంది జనసమీకరణ చేసేందుకు రాష్ట్ర బిజెపి నేతలు సన్నాహాలు మొదలుపెట్టారు. 

కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ చేతిలో బిజెపి ఓడిపోవడంతో కంగు తిన్న బిజెపి పెద్దలు, తెలంగాణలో ఎట్టి పరిస్థితులలో గెలిచితీరాలని పట్టుదలగా ఉన్నారు. అందుకే ఇప్పటి నుంచే ఢిల్లీ పెద్దలు తెలంగాణ బాట పడుతున్నారు. అయితే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉండటమే కాక అన్ని రంగాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపింది. పైగా తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందంటూ కేసీఆర్‌ మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ గట్టిగా ప్రచారం చేస్తున్నారు. కనుక ప్రజలు బిఆర్ఎస్‌ పార్టీవైపే మొగ్గు చూపవచ్చు.

ఈ పరిస్థితులలో తెలంగాణ ప్రజలు బిజెపికి ఎందుకు ఓట్లు వేసి గెలిపించాలో బిజెపి పెద్దలు సంతృప్తికరమైన సమాధానం చెప్పగలగాలి. అమిత్‌ షా ఖమ్మం సభలో ఏమైనా చెపుతారా లేక ఎప్పటిలాగే కేసీఆర్‌ కుటుంబ పాలన, మజ్లీస్ పార్టీతో దోస్తీ, హిందూ ముస్లింలు అంటూ పాడిందే మళ్ళీ పాడుతారా? చూడాలి.