జూలై నుంచి వికలాంగుల పించన్ రూ.4,116

ఈరోజు మంచిర్యాల జిల్లాలో సిఎం కేసీఆర్‌ ప్రగతి నివేధన సభలో వికలాంగులకు వెయ్యి రూపాయలు పింఛను పెంచుతున్నట్లు ప్రకటించారు. దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా తెలంగాణలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకొంటున్నాను.

ఇప్పటి వరకు వికలాంగులకు నెలకు రూ.3,116 పింఛను ఇస్తున్నాము. వచ్చే నెల నుంచి నెలకు రూ.4,116 ఇస్తామని కేసీఆర్‌ ప్రకటించగానే సభలో పాల్గొన్న ప్రజలు హర్షధ్వానాలు చేశారు.

ఈసారి సింగరేణికి భారీగా లాభాలు వచ్చాయని, కనుక ఈ దసరాకు సింగరేణి కార్మికులకు రూ.700 కోట్లు బోనసుగా పంచబోతున్నామని ప్రకటించడంతో ప్రజలు మళ్ళీ హర్షధ్వానాలతో కేసీఆర్‌కు జేజేలు పలికారు. 

తెలంగాణ ఏర్పాటు కోసం అందరం కలిసికట్టుగా పొరాడి సాధించుకొన్నామని లేకుంటే నేడు మంచిర్యాల జిల్లా ఏర్పడి ఉండేదే కాదు. ఇక్కడ ఇన్ని అభివృద్ధి పనులు జరిగి ఉండేవే కావని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం అధికారులు, ప్రభుత్వోద్యోగులు, సింగరేణితో సహా అన్ని శాఖలలో కార్మికులు ఎంతగానో కృషిచేశారని, అందరికీ శిరసు వంచి నమస్కారం చేస్తున్నానని అన్నారు.

మన అందరి సమిష్టి కృషితో ఇంతగా అభివృద్ధి చేసుకొన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్‌, బిజెపిలు మళ్ళీ నాశనం చేయడానికి వస్తున్నాయని, కనుక్ అవాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రైతులకు ఎంతో మేలు జరుగుతుంటే, తాము అధికారంలోకి వస్తే ధరణిని తీసి పక్కన పాడేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, కనుక వారినే బంగాళాఖాతంలోకి విసిరేయాలన్నారు. 

సింగరేణి గనులతో రాష్ట్రానికి సరియపడినంత విద్యుత్‌ ఉత్పత్తి చేసుకొంటున్నామని, దేశ అవసరాలకు కూడా విద్యుత్‌ అందిస్తున్నామని కానీ మోడీ ప్రభుత్వం సింగరేణి గనులను ప్రవేటీకరించాలని మొండిగా ప్రయత్నిస్తోందన్నారు. దేశంలోనే పుష్కలంగా బొగ్గు గనులు ఉండగా, ఆస్ట్రేలియా నుంచి తప్పనిసరిగా బొగ్గు దిగుమతి చేసుకోవాలని మోడీ ప్రభుత్వం రాష్ట్రాలను ఒత్తిడి చేస్తుండటం చాలా దుర్మార్గమని కేసీఆర్‌ అన్నారు.

దశాబ్ధాల పాలనలో తెలంగాణకు తీరని నష్టం కలిగించిన కాంగ్రెస్ పార్టీని, ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీయాలని చూస్తున్న బిజెపిని వచ్చే ఎన్నికలలో ప్రజలు బంగాళాఖాతంలోకి విసిరేయాలన్నారు.